స్వేచ్ఛ, వనపర్తి మార్చి 18: Power Supply in Wanaparthy: వనపర్తి జిల్లాలో యాసంగి పంటలు ఎండిపోకుండా ఉండేందుకు రైతులకు సరిపడా విద్యుత్ సరఫరా అందించడమే కాకుండా, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి మండల పరిధిలోని పెద్దగూడెం తాండ పరిధిలో ఇటీవల ఎండిపోయిన వ్యవసాయ పొలాలను పరిశీలించారు.
మొత్తం 36 మంది రైతులకు చెందిన 45 ఎకరాల వరకు పంట ఎండిపోయినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ.. తామంతా బోరు బావుల పైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామని, విద్యుత్ సరఫరాలో సమస్యల కారణంగా పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తమను ఆదుకోవాలని కలెక్టర్‌కు విన్నవించారు.
Also read: KCR: జిల్లాలకు కేసీఆర్.. సిల్వర్ జూబ్లీ సక్సెస్ కోసమేనా?
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యాసంగిలో పంట వేసిన రైతుల పంటలు ఎండిపోకుండా బోరు బావుల ద్వారా నీరు అందించేందుకు సరిపడా విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ని ఆదేశించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తప్పనిసరిగా పంటకు నీరు అందించేందుకు సరిపడా విద్యుత్ సరఫరా చేయించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అదేవిధంగా కొత్తగా విద్యుత్ స్తంభాలు వేయించేందుకు అటవీ శాఖ నుంచి అభ్యంతరం ఉన్న నేపథ్యంలో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు నివేదిక పంపాలని, దాని అనుగుణంగా కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించి సంబంధిత ప్రాంతంలో రైతులందరికీ విద్యుత్ సౌకర్యం కల్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.