Bhatti vikramarka: కాంగ్రెస్ అంటేనే వ్యవసాయమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్, సచివాలయంలో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తమ ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన చర్యలను భట్టి విక్రమార్క వివరించారు. రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ, రైతన్నలకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా, పెట్టుబడి సాయం కింద రైతు భరోసా, సన్నాలు సాగు చేసిన రైతులకు క్వింటాలుకు రూ. 500 బోనస్, రైతు బీమా, భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
ఈ సీజన్‌లో పంటలకు పెట్టుబడి సాయంగా తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ
చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. అన్నదాతల సంక్షేమం కోసం 24 గంటల ఉచిత విద్యుత్తు పథకం కింద నెలకు రూ. 900 కోట్ల చొప్పున, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 17,091 కోట్లను ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించిందని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ ద్వారా రాష్ట్రంలోని 29.40 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 21,763 కోట్ల రూపాయలు అందించామని చెప్పారు.
సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాలుకు రూ. 500 బోనస్ రూపంలో ఇప్పటి వరకు రూ. 1,199 కోట్లు చెల్లించామని వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి పథకాలన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలపై పొలిటికల్ అఫైర్స్ కమిటీ హర్షం వ్యక్తం చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. బూత్, మండల, జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు పీసీసీ కార్యాచరణను తీర్మానించిందని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘రైతు బంధు’ పేరిట అరకొర డబ్బులు వేస్తూ రైతులను మోసం చేసిందని ఆయన విమర్శించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.