Bhatti Vikaramarka: తెలంగాణ కాంగ్రెస్ టాప్ లీడర్ల లిస్ట్ తీస్తే.. అందులో భట్టి పేరు టాప్ లోనే ఉంటుంది. ఆది నుంచి ఆయన కాంగ్రెస్ లోనే ఉంటూ ప్రజల విశ్వాసాన్ని పొందగలిగారు. సుదీర్ఘంగా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న ఆయన.. ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకోగలిగారు. కేసీఆర్ హయాంలో పార్టీలో హేమాహేమీలైన లీడర్లే ఓడినప్పటికీ ఆయన మాత్రం ఓటమి ఎరుగని ధీరుడిలా నిలిచాడు. ఆనాడు ప్రతిపక్షం తరఫున అసెంబ్లీలో బలమైన వాయిస్ వినిపించిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు.
2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో, కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో భట్టి విక్రమార్క ముఖ్య పాత్ర పోషించారు. ఎన్నికల ముందు ఆయన చేపట్టిన పాదయాత్ర ‘పీపుల్స్ మార్చ్’ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేసింది. ఆ విధంగా కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన భట్టి సేవలను గుర్తించిన అధిష్ఠానం ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అనంతరం 2024లో జరిగిన ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి విజయం సాధించడంలో భట్టి విక్రమార్క కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా ఆయనకు పార్టీలో మరో గౌరవం దక్కింది.
Gaddam Shiva Prasad: హరితహారం కార్యక్రమంపై స్పీకర్ మాస్ ర్యాగింగ్.. దెబ్బకు బీఆర్ఎస్ సైలెంట్!
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీని హై కమాండ్ ప్రకటించింది. అందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చోటు కల్పించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లు ఈ డ్రాఫ్టింగ్ కమిటీని ప్రకటించారు. ఏప్రిల్ 8, 9 తేదీలలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏఐసీసీ కీలక సమావేశాలు జరగనున్నాయి. అందుకోసమే ఈ డ్రాఫ్టింగ్ కమిటీని నియమించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యచరణ, వ్యూహాలు, విధానాలు, అలాగే రాజకీయ నిర్ణయాలను రూపొందించడంలో డ్రాఫ్టింగ్ కమిటీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో భట్టి విక్రమార్కకు చోటు దక్కడం ఆయన రాజకీయ నైపుణ్యం, అనుభవం, మరియు పార్టీ పట్ల నిబద్ధతకు నిదర్శనమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
కాగా, ఏప్రిల్ 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది, ఆ తర్వాత ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు. ఇదిలావుంటే.. గత ఏడాది డిసెంబర్‌లో కర్ణాటకలోని బెళగావిలో “నవ సత్యాగ్రహం” సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అహ్మాదాబాద్ మీటింగ్ లు ఉంటాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ సమావేశాల్లో పార్టీ రాజకీయ మేనిఫెస్టో, సంస్థాగత మార్పులు, మరియు రాబోయే ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను చర్చించి ఖరారు చేయడానికి డ్రాఫ్టింగ్ కమిటీ కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు.