kandi board
తెలంగాణ

Kandi Board: తాండూరు రైతుల కళ… కంది బోర్డుకు మోక్షమెప్పుడో?

రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్‌ జిల్లాలో కంది సాగు
బోర్డు ఏర్పాటు‌కు మూడు సార్లు ప్రతిపాదనలు.. ఫలితం శూన్యం
పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
ఎన్నికల్లో అస్త్రంగా మల్చుకున్న రాజకీయ పార్టీలు
బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్న రైతాంగం

రంగారెడ్డి, స్వేచ్ఛ : కందులు అనగానే వెంటనే గుర్తుకొచ్చేది తాండూరు(Tandur). తాండూరు కందికి జాతీయ స్థాయిలో భౌగోళిక గుర్తింపు(Geographical Indication) లభించడంతోపాటు ఇక్కడి కందిపప్పు(Toor Dal)కు దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్నది. ఏడాది పొడవునా..రైతులకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు విత్తనాలు(Seeds), రాయితీల(Discount)తో ఎన్నో ప్రయోజనాలు కలిగే కంది బోర్డు(Kandi Board) ప్రకటన కలగానే మిగిలింది. ఇప్పటికే మూడు సార్లు ప్రతిపాదనలు పంపినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదు. ప్రతి ఎన్నికల్లో బోర్డు ఏర్పాటును రాజకీయ పార్టీలు(Political Parties) అస్త్రంగా మలుచుకుంటుండగా.. ఎన్నికలు అయిపోగానే ఈ అంశం షరాముమూలే అవుతున్నది.

2 లక్షల ఎకరాల్లో కంది సాగు..
రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో కంది సాగవుతుండగా..సింహభాగం వికారాబాద్‌ జిల్లాలోనే అత్యధికంగా 2లక్షల ఎకరాల్లో కంది పంట సాగవుతున్నది. వర్షాధార పంటగా రైతులు అత్యధిక ప్రాధాన్యం కంది పంటకే ఇస్తారు. ఈ జిల్లాలో తాండూరు, పెద్దముల్‌, యాలాల, బషీరాబాద్‌ మండలాల్లో ఎక్కువగా కంది పంట సాగవుతున్నది. వికారాబాద్‌ జిల్లాతోపాటు పక్కన ఉన్న నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల నుంచి పంట విక్రయాలకు తాండూరు మార్కెట్‌కు రావాల్సిందే. అయితే రుచికరంగా ఉండటం.. తక్కువ సమయంలో ఉడకడం తాండూరు కందిపప్పు ప్రత్యేకత. దేశవ్యాప్తంగా తాండూరు కందిపప్పు మార్కెటింగ్‌ అవుతున్నది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల్లో కందులను కొనుగోలు చేస్తున్నప్పటికీ రైతులకు పూర్తి ప్రయోజనం కలగడం లేదు. మార్కెట్‌ యార్డుల్లో వ్యాపారులు సిండికేట్‌గా మారి ఇష్టానుసారంగా రేట్లు నిర్ణయించి కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. కంది బోర్డు ఏర్పాటు చేస్తే ధర నిర్ణయం రైతుల చేతుల్లోనే ఉండటంతోపాటు ఏడాది పొడవునా రైతులు గిట్టుబాటు ధర పొందే అవకాశం ఉండనున్నది.

బోర్డు ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితం
2022లో తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు దక్కింది. తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు కొంగొత్త పరిశోధనలు చేసి కొత్త వంగడాలను కనుగొంటున్నారు. కంది బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత ఉపయుక్తం కానుండటంతో పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇప్పటివరకు 2019, 2021, 2023లలో మూడుసార్లు ప్రతిపాదనలు పంపినప్పటికీ కేంద్రం బోర్డు ఏర్పాటుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాండూరులో కంది బోర్డును ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం పట్ల ఈ ప్రాంత రైతాంగం కేంద్రం పై మండిపడుతున్నది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కంది బోర్డును ప్రధానాంశంగా చేసుకొని, ఎన్నికలయ్యాక విస్మరిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు సాగదీత ధోరణి అవలంభించిందన్న ఆరోణలున్నాయి. గత ఎన్నికల ముందు రేవంత్‌ రెడ్డి కంది బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈసారైనా బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని ఈ ప్రాంత రైతాంగం కోరుతున్నది.

బోర్డు ఏర్పాటుతో ప్రయోజనాలెన్నో..
కంది బోర్డు ఏర్పాటు వల్ల ప్రత్యేక పాలకవర్గం ఏర్పాటవుతుంది. కందుల కొనుగోలుపై ధరల నియంత్రణ ఉంటుంది. పంట సాగుపై తరచుగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉండటంతో రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటల సాగు చేసేందుకు ఉపయుక్తం కానున్నది. శాస్త్రవేత్తలు సైతం ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తాయి. పంటల బీమా సౌకర్యం కలుగుతుంది. రైతులకు విత్తనాలు, ఎరువులలో రాయితీలు లభిస్తాయి.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?