Sarpanch Elections 2025: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగ కొనసాగుతున్నాయి. అన్ని చోట్లా ప్రత్యర్థుల మధ్య పోటీ ఉంటే కొన్ని చోట్ల మాత్రం కుటుంబ సభ్యుల మధ్య పోటీ నెలకొంటుంది. అదే తరహాలో పెద్దపల్లి జిల్లా (Peddapalli District) పాలకుర్తి మండలంలోని ఘన శ్యాందాస్ నగర్ పంచాయతీ (Ghan Shyam Das Nagar Panchayat) సర్పంచ్ బరిలో అభ్యర్థులుగా అత్తా కోడలు నామినేషన్ దాఖలు చేసి పోటి పడుతున్నారు.
గ్రామంలో సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కాగా మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తన తల్లి సూర నర్సమ్మతో నామినేషన్ వేయించారు. అయితే నర్సమ్మ పెద్దకోడలు సూర రమాదేవి సైతం సర్పంచ్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒకే ఇంటి నుంచి అత్తాకోడలు సర్పంచ్ స్థానంలో బరిలో నిలిచారు. గతంలో ఘన శ్యాందాస్ నగర్.. కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. అప్పుడు ఎస్సీలకు రిజర్వు కాగా.. సమ్మయ్య తన భార్య సునీత (ఎస్సీ) సర్పంచ్ గా బరిలో దింపి గెలుపొందారు.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు..
తర్వాత ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటైన అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో సూర సమ్మయ్య సర్పంచ్ గా గెలుపొందారు. ప్రస్తుతం బీసీ మహిళకు రిజర్వు కావడంతో సమ్మయ్య తన భార్య కు అవకాశం లేక పోవడంతో తల్లి నర్సమ్మను బరిలో నిలిపారు. సమ్మయ్య వదిన రమాదేవి కూడా సర్పంచ్ గా బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది. ప్రజల మద్దతుతో తాము బరిలో దిగామని, ఓటేసి సర్పంచిగా తమను గెలిపిస్తారని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒకే ఫ్యామిలీ నుంచి అత్తా, కోడలు బరిలో నిలవడంతో గ్రామస్తులు ఎవరికి ఓటు వేయాలో అర్థంకాక తికమక పడుతున్నారు.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామ పంచాయతీలోనూ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకే కుటుంబంలోని భర్త, భార్య, కుమారుడు ఎన్నికల బరిలో నిలిచి ఆశ్చర్యపరిచారు. గ్రామంలో 12 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ వేయగా అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బరిలో నిలవడం విశేషం. గత సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన సాయ గౌడ్ కు పలు కారణాలతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ముందు జాగ్రత్తగా తన భార్య పుష్పలత, కుమారుడు వెంకటేష్ తో కూడా నామినేషన్ వేయించాడు. ముగ్గురి నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిగణలోకి తీసుకోవడంతో వారు బరిలో నిలిచారు.

