తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: CPM Leaders demand: వెల్నెస్ కేంద్రాలు వైద్యం అందించకపోగా కొందరు అక్రమార్కులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దండుకోవడానికి కేంద్రాలుగా మారాయని సీపీఎం నేతలు ఆరోపించారు. వెల్నెస్ కేంద్రాల్లో జరుగుతున్న మందుల అక్రమదందాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఎం సిటీ కార్యదర్శి ఎం. వెంకటేశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లు, జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకోసం ప్రవేశపెట్టిన నగదు రహిత ఉచిత వైద్య సదుపాయం అందించేందుకు రాష్ట్రంలో 12 వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. వాటిపై పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందన్నారు.
ప్రతి ఏటా భారీ మొత్తంలో మందుల కోసం అవసరానికి మించి ఇంటెంట్లు పెట్టి తెప్పిస్తున్నారని కానీ ఇవి రోగులకు అందడం లేదన్నారు. ఫార్మా డిస్ట్రిబ్యూటర్లతో కొందరు ఉన్నతాధికారులు కుమ్మక్కై అడ్డగోలుగా మందులు తెప్పిస్తున్నారని ఆరపించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.19.19కోట్లు మందుల కోసమే ఖర్చు అయిందన్నారు.
రోగులతో సంబంధం లేకుండా వాళ్ల హెల్త్ కార్డు నెంబర్ లపై ఖరీదైన మందులు కొందరు ప్రైవేట్ క్లీనిక్ లకు తరలిస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్టు కార్డు కలిగిన కొందరు సిబ్బంది ఆ పేరుతో మందులను కాజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మందుల దందా, అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వెల్ నెస్ సెంటర్లో పర్మినెంట్ ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎం. శ్రీనివాస్, దశరథ్, ఆర్. వెంకటేష్ పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు