Electricity Department: విద్యుత్ సంస్థలో ప్రమోషన్ల అంశంపై వివాదం మొదలైంది. అది కాస్త సమ్మెకు దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. (Regular employees) రెగ్యులర్ ఉద్యోగులకు ఒక రూల్, ఆర్టీజన్లకు ఒక రూల్ ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి మూడేండ్లకు సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాల్సినా అందుకు అనుగుణంగా సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ కన్వర్షన్ జేఏసీ (JAC) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
ఏండ్లుగా పనిచేస్తున్న తమ ఇబ్బందులపై సంస్థ దృష్టి సారించి ప్రమోషన్లు కల్పించాలని జేఏసీ (JAC) నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీజన్లు అంటే సంస్థ చిన్న చూపు చూస్తున్నదని, అందుకే తమ ఇబ్బందులను గురించి పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు, ఆర్టీజన్లకు మధ్య వ్యత్యాసం కోసం స్టాండింగ్ రూల్స్‌ను తీసుకొచ్చినా దానికి సైతం అధికారులు పాతరేశారని వాపోతున్నారు.
Also Read:GHMC: సుప్రీంకోర్టుకు చేరిన చెత్త వివాదం.. త్వరలోనే వాదనలు!
కన్వర్షన్ ఇవ్వాల్సిందే..
తెలంగాణ విద్యుత్ (Electricity) సంస్థల్లో మొత్తం 19 వేల మంది ఆర్టీజన్లు ఉన్నారు. ఒక్క ఎస్పీడీసీఎల్‌లోనే దాదాపు 11 వేల మంది ఉన్నారు. అలాగే ఎన్పీడీసీఎల్‌లో 4 వేలు, జెన్కోలో దాదాపు 4 వేల మంది ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికారులు స్టాండింగ్ రూల్స్‌ను ప్రవేశపెట్టారు. 2018 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే, ఆ ఏడాది ఎన్నికల నేపథ్యంలో తమ ప్రమోషన్ల అంశాన్ని పక్కన పెట్టేశారని తెలంగాణ (Electricity Artisans) విద్యుత్ ఆర్టీజన్ కన్వర్షన్ జేఏసీ విమర్శలు చేస్తున్నది. సంస్థ పట్టించుకోకపోవడంతో 19 వేల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నది. తమకు న్యాయం చేయకుంటే సమ్మెకు సిద్ధమవుతామని సీఎండీలకు సైతం జేఏసీ నాయకులు నోటీసులు అందజేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టీజన్లను అర్హత ఆధారంగా కన్వర్షన్ ఇవ్వాలని, అలాగే ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రమోషన్లలో లేని పోటీ చర్యల్లో ఎందుకు?
విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టీజన్లకు ప్రమోషన్ ఇస్తారా, లేక రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే రూల్స్‌ను అయినా అమలు చేసి న్యాయం చేస్తారా అనే ప్రశ్నలను తెలంగాణ (Electricity Artisans)విద్యుత్ ఆర్టీజన్ కన్వర్షన్ జేఏసీ లేవనెత్తింది. ఎందుకంటే ప్రమోషన్లకు రెగ్యులర్ ఉద్యోగులకు ఉండే నిబంధనలు అమలు చేయని సంస్థలు, ఆర్టీజన్ల వల్ల ఏదైనా తప్పు జరిగినట్లయితే మాత్రం రెగ్యులర్ ఉద్యోగుల్లాగా చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రమోషన్ల అంశం ఏండ్లుగా పెండింగ్‌లో ఉందని, స్టాండింగ్ రూల్స్ ప్రకారం చూసుకున్నా 2022లోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని, కానీ ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని అంటున్నారు. అందుకే ఇన్నేండ్ల ఎదురుచూపుల తర్వాతే సమ్మె చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
బిల్లులు కొట్టం.. కలెక్షన్ చేయం
సంస్థ ఆర్టీజన్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని న్యాయం చేయాలి. లేదంటే వచ్చే నెలలో సమ్మె చేసి తీరుతాం. ఇప్పటికే నోటీసులను ఎస్పీడీసీఎల్ సీఎండీ, జెన్కో సీఎండీ, ట్రాన్స్ కో సీఎండీలకు అందించాం. సంస్థ కోసం ఏండ్లకు ఏండ్లుగా అహర్నిశలు శ్రమిస్తున్నాం. రిటైర్డ్ అయితే బెనిఫిట్స్ కూడా అందని పరిస్థితి ఉంది. గ్రాట్యుటీ కూడా చెల్లించకపోతే రిటైర్డ్ అయిన తర్వాత కుటుంబం బతికేదెలా. సమ్మె ప్రజలకు ఇబ్బంది పెట్టేలా ఉండదు. 24 గంటలు కరెంట్ బరాబర్ ఇస్తాం. కానీ విద్యుత్ మీటర్ రీడింగ్ తీయబోం. కలెక్షన్ చేయబోం.
– గ్యాంబో నాగరాజు, తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ కన్వర్షన్ జేఏసీ కో చైర్మన్
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్ రావు విచారణ!