Nominated Posts: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా.. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.‘త్వరలో.. ఇదిగో వచ్చే వారం.. అదిగో వచ్చే నెల” అంటూ అగ్రనేతలు, ముఖ్య లీడర్లు హామీలు ఇస్తున్నప్పటికీ, అవి అమలు కావడం లేదు.దీంతో ఆశావహుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. పార్టీ కోసం రక్తం చిందించిన కార్యకర్తలు, సీనియర్ నేతలు ఇప్పుడు “మాకు దక్కే గౌరవం ఇదేనా?” అని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో పదవుల వేటలో ఉన్న నేతలకు “సరైన సమయం వస్తుంది” అని సర్దిచెప్పారు. కానీ ఇప్పటికీ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పదవులు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా గాంధీభవన్ లోని పార్టీ వింగ్ చైర్మన్లు నియామకాలు ఇప్పటికీ జరగలేదు.
కీలక పదవులు ఇప్పటికీ ఖాళీ..
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం పార్టీ పదవులు కూడా భర్తీ చేయకపోవడం విస్మయానికి గురి చేస్తుందని క్షేత్రస్థాయి లీడర్లు మండిపడుతున్నారు. డిసెంబరు రెండవ వారం 2025 లో పార్టీ చైర్మన్ల భర్తీ జరుగుతుందని టీపీసీసీ(TPCC) ఇటీవల ప్రకటించింది. కానీ ఆ గడువు కూడా ముగిసిపోవడం గమనార్హం. ఇక ప్రభుత్వంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. కార్పొరేషన్ ఛైర్మన్లు, గ్రంథాలయ సంస్థలు, మార్కెట్ కమిటీల వంటి కీలక పదవులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి.జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వందలాది పదవులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కాంగ్రెస్(Congress) లీడర్లు సొంత పార్టీపైనే ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు పదవులు దక్కవన్న ఆందోళనతో పలువుర నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేగాక తమ అనుచరులకు పదవులు ఇప్పించుకోలేకపోతున్నామనే అసహనం ఎమ్మెల్యేల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: Rachakonda Police: రాష్ట్రంలోనే రాచకొండ కమిషనరేట్ ఫస్ట్ ప్లేస్.. ఎందుకో తెలుసా..!
అలసత్వం ప్రమాదమే…
కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి కమిటీలు ఏర్పడకపోవడంతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. పూర్తి స్థాయి కమిటీలు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు నామమాత్రంగా సాగుతున్నాయి.అంతేగాక జిల్లా అధ్యక్షులు, మండల స్థాయి కమిటీల మధ్య సమన్వయం కరువైంది.పదవుల ఊసే లేకపోవడంతో కేడర్‌లో ఉత్సాహం తగ్గిపోయింది. ఏ కార్యక్రమం చేపట్టినా “అంతా మాకేనా? మాకు వచ్చే లాభమేంటి?” అన్న భావన కార్యకర్తల్లో బలంగా నాటుకుపోతోంది.సామాజిక న్యాయం పేరిట పార్టీ కాలయాపన చేస్తుందని అగ్రనేతలు చెప్తున్నప్పటికీ, మరింత ఆలస్యం చేస్తే ఆయా లీడర్లంతా ఛే జారిపోయే ప్రమాదం ఉన్నదనే అంశాన్నీ గాంధీభవన్ పెద్దలు పరిగణించడం లేదు. ఇప్పటికే స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ ఎస్ గట్టి ఫైట్ ఇచ్చింది. ఈ రెండు పార్టీల మధ్య తగ్గాపోరు కొనసాగింది. ఈ నేపథ్యంలో లీడర్ల అసంతృప్తి అధికార పార్టీ నష్టానికి కారణం కావచ్చు.
పవర్ రాగానే ప్రభుత్వానికి షిప్టు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు పార్టీ ఫ్రంటల్ విభాగాలకు చైర్మన్లుగా పనిచేసినోళ్లనే ప్రభుత్వంలోని కార్పొరేషన్లకు ప్రెసిడెంట్లుగా నియమించారు. పదేళ్ల పాటు ఆ సెక్టార్ సమస్యలు, కష్ట, నష్టాలు తెలిసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో సర్కార్ పెద్దలు స్పష్టం చెప్పారు. ఆ తర్వాత ఆయా సీట్లలో ఖాళీలు ఏర్పడినా..భర్తీ వైపు పార్టీ ఫోకస్ పెంచలేదు. ?కాంగ్రెస్ పార్టీ వికలాంగుల చైర్మన్ గా ముత్తినేని వీరయ్య, ఫిషరీస్ చైర్మన్ గా మెట్టు సాయికుమార్(Mettu Sai Kumar), బీసీ సెల్ కు నూతి శ్రీకాంత్(Nuthu Srikanth), రైతు సెల్ కు అన్వేష్‌రెడ్డి, ఎస్టీ సెల్ కు ప్రీతమ్, మైనార్టీ సెల్ కు ఫహీం తదితరులు పార్టీలోని చైర్మన్లుగా పనిచేశారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 37 మందికి కార్పొరేషన్ చైర్మన్లు గా అవకాశం ఇవ్వగా, ఇందులో 90 శాతం మొదట్నుంచి గాంధీభవన్ వేదికగా పార్టీలోని వింగ్ లకు బాస్ లుగా పనిచేసినోళ్లకే అవకాశం కల్పించడం గమనార్హం. కార్పొరేషన్ చైర్మన్లంతా ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత గాంధీభవన్ లోని ఆ పార్టీ వింగ్ చైర్మన్ సీట్లన్నీ ఖాళీగా ఉండిపోయాయి. ప్రస్తుతం ఆయా ఛాంబర్లు ఖాళీగా దర్శనమిస్తుండగా, కొన్ని రూమ్స్ కు తాళాలు వేశారు.
Also Read: Chinmayi Shivaji: నటుడు శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి ఆగ్రహం.. ‘ఆ నీతి సూత్రాలు మాకెందుకు?’

