Etela Rajender: సోషల్ మీడియాపై కాంగ్రెస్ పార్టీకి అక్కసు
ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందే సోషల్ మీడియా ద్వారా
సోషల్ మీడియాను శత్రువులపై ప్రయోగించాలి
కానీ, మనపై మనమే ప్రయోగించుకోవడం సరికాదు
స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే ఎన్నికలు నిర్వహించట్లేదన్న ఎంపీ ఈటల రాజేందర్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఇప్పుడు అదే సోషల్ మీడియాపై అక్కసు వెళ్లగక్కుతోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఐటీ, సోషల్ మీడియా వర్క్ షాప్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించగా, ఈటల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు. గతంలో న్యూస్ పేపర్ కోసం ఎదురుచూసేవారని, కానీ నేడు ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా క్షణాల్లో సమాచారం చేరిపోతోందన్నారు.
Read Also- Sahasra case: సహస్ర కేసుపై జనం వ్యక్తం చేస్తున్న సందేహాలు ఇవే!
బీజేపీ సోషల్ మీడియాకు నాలుగు కర్తవ్యాలు ఉంటాయని ఈటల వివరించారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే శత్రువులను చీల్చి చేండాడే బాధ్యత కూడా వారిపైనే ఉందన్నారు. మాజీ, తాజా ముఖ్యమంత్రులు అంతా తామే చేస్తున్నామని చెప్పుకుంటున్నారని ఈటల చురకలంటించారు. అది వారి తాత జాగీరు కాదని చెప్పే దమ్ము సోషల్ మీడియాలో ఉందని, వేగంగా స్పందించే వారు మాత్రమే సోషల్ మీడియాలో ఉంటారన్నారు. ఫ్యాక్ట్ చెక్‌తో పాటు ఎవరు.. ఏం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారో చెప్పడం కూడా సోషల్ మీడియా బాధ్యతనే అని వివరించారు. చేసిన పని చెప్పుకోవడం కూడా ఎంతో అవసరమని తెలిపారు. సోషల్ మీడియాను శత్రువుపై ప్రయోగించాలని, కానీ సొంతవారిపై ప్రయోగించడం సరికాదని ఆయన స్పష్టంచేశారు. సోషల్ మీడియా ధర్మం, ప్రజలవైపు ఉండాలని సూచించారు.
Read Also- Ganesh Chaturthi: పర్యావరణహిత వినాయక చవితి జరపండి.. జన విజ్ఞాన వేదిక సూచన
స్థానిక సంస్థలు సమగ్రంగా పనిచేస్తేనే గ్రామ స్వరాజ్యం సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అయినా ఎన్నికలు నిర్వహించడానికి వెనుకాడుతోందని, బీసీ రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఓడిపోతామనే భయంతోనే ఎన్నికలు నిర్వహించడం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయని, కానీ నేడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించే అవకాశం సోషల్ మీడియాకే ఉందన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఇచ్చే నిధులన్నీ కేంద్రానివేనని, కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడం లేదన్నారు. నగరంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనేనని వివరించారు. బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియా బృందానికి ఈటల వివరించారు.