Caste Census Survey: కేంద్ర ప్రభుత్వం త్వరలో తలపెట్టనున్న జనాభా లెక్కలతో పాటు కుల గణనను కూడా చేర్చడాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వాగతించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కుల గణన నిర్వహణతో తెలంగాణ రాష్ట్రం.. యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో 3 నెలల్లోనే కులగణన నిర్వహించినట్లు సీఎం గుర్తు చేశారు. అయితే కేంద్రం కుల గణనపై అనుసరించే విధి విధానాలేంటో తెలియజేయాల్సిన అవసరముందని సీఎం నొక్కి చెప్పారు.
జోడో యాత్రలో హామీ
జోడో యాత్రలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశ ప్రజల గుండెచప్పుడు విన్నారని.. కుల గణన చేస్తామని హామీ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ సూచనలతోనే తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని అన్నారు. జనగణనలో కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని తొలగించాలని కేంద్రానికి రాష్ట్రం తరపున తీర్మానం కూడా పంపినట్లు చెప్పారు. జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలతో కలిసి ధర్నా సైతం చేపట్టామని, తమ ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ కులగణనపై నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
ప్రజలు, పార్టీల భాగస్వామ్యంతో
అయితే జనగణనతో కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రధాని చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కులగణనకు అనుసరించే విధానాలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని డిమాండ్ చేశారు. ఇందుకు కేంద్రమంత్రులతో కూడిన కమిటీతో పాటు, అధికారులతో కూడిన మరో కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మేం కులగణన చేపట్టే క్రమంలో విధి విధానాలు రూపొందించి ప్రజల ముందు పెట్టామని.. తెలంగాణలో 57 ప్రశ్నలతో 8 పేజీలతో కూడిన సమాచారాన్ని సేకరించినట్లు తెలిపారు. కులగణనలో తాము అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేశామని తెలిపారు. ఎక్కడా పార్టీ కార్యక్రమంలా చేయ లేదని గుర్తుచేశారు.
దేశానికే రోల్ మోడల్
పూర్తి పారదర్శకంగా కులగణన పూర్తి చేశాము కాబట్టే దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని అన్నారు. కులగణనలో దేశానికి తెలంగాణ ఓక మోడల్ గా మారిందని చెప్పారు. కులగణనపై కేంద్రంతో మా అనుభవాన్ని పంచుకోవడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు మేలు జరగాలనేదే తమ సంకల్పమని అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలను అమలు చేసేందుకు ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ చెప్పారు.
Also Read: Gold Rate Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఇదే మంచి ఛాన్స్!
కులగణపై బీజేపీ యూటర్న్
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం కులగణన చేసి చూపించిందని సీఎం రేవంత్ మరోమారు స్పష్టం చేశారు. మమ్మల్ని విమర్శించే బీజేపీ నేతలను ఒకటే అడుగుతున్నని.. పదేళ్లుగా అధికారంలో ఉన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయలేదని నిలదీశారు. రాష్ట్ర బీజేపీ నేతలు రాజకీయ లబ్ది కోసమే మాపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. స్థానిక బీజేపీ నాయకులలో అసూయ, అసంతృప్తి కనిపిస్తోందని చెప్పారు. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారనే బాధ వారిలో కనిపిస్తోందని చెప్పారు. మొన్నటి వరకు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిందన్న రేవంత్ రెడ్డి.. మా ఒత్తిడితోనే కేంద్రం కులగణనకు ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు.