CM Revanth Reddy: హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన శ్రీ మహాత్మ బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమం (Basaveshwara Jayanthotsava program) లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత పదో తరగతి ఫలితాలు (10th Results) విడుదల చేసిన సీఎం.. అనంతరం మాట్లాడారు. 12వ శతాబ్దంలోనే సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడని కొనియాడారు. ఆయన జయంతి రోజున పదోతరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. బసవన్న స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చిన రేవంత్.. ఆయనపై విమర్శలు గుప్పించారు.
ప్రజలే ప్రశ్నిస్తున్నారు
ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. వరంగల్ సభలో తాము చేసిన మంచిని అభినందించి.. ప్రజా సమస్యలను ప్రస్తావించి ఉంటే ప్రజలే ఆయన్ను అభినందించేవారని పేర్కొన్నారు. ‘ఇన్నాళ్లుగా ఆయన ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీతభత్యాలు తీసుకున్నారు.. ఇది ఏ చట్టంలో ఉంది?’ అంటూ రేవంత్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా రూ. 65 లక్షల జీతం, ప్రభుత్వ వాహనాలు, పోలీస్ భద్రతను అనుభవిస్తూ ఎందుకు ఆ హోదాకు న్యాయం చేయడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు.
ఇవేమి కనిపించడంలేదా?
కాంగ్రెస్ హయాంలో సంక్షేమ పథకాలు ఆగిపోయాయని కేసీఆర్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి వీటిలో ఏది ఆగిపోయిందో చెప్పాలని ప్రశ్నించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని.. ఇవేవీ మీకు కనిపించడంలేదా? అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. మీరు ఏ మత్తులో తూగుతున్నారో మీకే తెలియాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కడుపు నిండా విషమే
కాంగ్రెస్ ప్రభుత్వంపై కడుపు నిండా విషం పెట్టుకుని రజతోత్సవ సభలో విద్వేష పూరిత ప్రసంగం చేశారని కేసీఆర్ పై సీఎం రేవంత్ మండిపడ్డారు. ప్రసంగం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఏం చేయాలనుకుంటున్నారని నిలదీశారు. ప్రజలు తెలివైన వారని.. ఎవరేం చేశారో వారికి బాగా తెలుసని చెప్పారు. తాము చేసిన సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమని సీఎం సవాలు విసిరారు. కాళేశ్వరం, ఉచిత బస్సు, రుణమాఫీ, రైతు బంధు, మేం ఇచ్చిన 60 వేల ఉద్యోగాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన వీటిలో దేనిపై చర్చ చేద్దామో చెప్పాలని కేసీఆర్ ను ఛాలెంజ్ చేశారు.
విమర్శించే హక్కు లేదు
తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలన్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సైతం రేవంత్ తప్పుబట్టారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అంటూ నిలదీశారు. పదేళ్లు దోచుకున్న నీకు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఆగమైంది తెలంగాణ కాదని.. కేసీఆర్ కుటుంబమని అన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు కేసీఆర్ వరంగల్ వెళ్లారని అన్నారు. అక్కడ పాపాలు కడుక్కోవడానికి బదులు.. అబద్దాలు చెప్పి ఇంకో తప్పు చేశారని విమర్శించారు. సభలో కనీసం నా పేరు కూడ పలకలేకపోయారని అన్నారు.