తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. ఏఐసీసీ నుంచి పిలుపు రావడంతో పర్యటన ఖరారైంది. దీనికి అనుగుణంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగే సమావేశాన్ని కూడా ఉదయమే నిర్వహించేలా ప్రీ-పోన్ అయింది. సీఎల్పీ తరహాలోనే ఈ సమావేశాన్ని నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేయాలనుకుంటున్నారు. తొలుత నిర్ణయించుకున్న షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం తర్వాత ఈ సమావేశం జరగాల్సి ఉన్నది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ఏఐసీసీ నేతలతో భేటీ కావాలని సీఎం భావించారు. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిపోవడంతో ఏఐసీసీ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఈ రెండు ప్రోగ్రామ్‌లలో మార్పులు అనివార్యమయ్యాయి. ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ తీర్మానాల గురించి ఏఐసీసీ నేతలకు వివరించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టో, డిక్లరేషన్‌లలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని తెలియజేయనున్నారు.
Also Read : స్థానిక ఎన్నికల్లో సీపీఎం ఒంటరి పోరే
వీటికి తోడు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితరాలపై కూడా చర్చించే అవకాశమున్నది. గత నెలలో ఢిల్లీ పర్యటన సందర్భంగానే అధిష్టానం ముందు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత చర్చిద్దామని వాయిదా వేసినట్లు పార్టీ సీనియర్ నేతలు పేరకొన్నారు. ఏఐసీసీ నుంచి పిలుపు రావడంతో క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలు కొలిక్కి వచ్చే అవకాశమున్నది.
మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆశలు పెట్టుకున్నవారికి ఈసారి సీఎం ఢిల్లీ ట్రిప్‌తో ఉత్కంఠకి తెరపడిపోతుంది అనే ధీమా పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలనుకుంటున్నందున ఈ అంశాన్ని కూడా ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకెళ్ళే అవకాశమున్నది. ఢిల్లీ టూర్ ఎన్ని రోజులుంటుంది.. సీనియర్ నేతలతోనూ ఏఐసీసీ చర్చిస్తుందా… ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఇస్తుందా… ఇలాంటి చర్చలు పార్టీ రాష్ట్ర స్థాయి నేతల్లో మొదలయ్యాయి.
ఫిబ్రవరి 15 లోగానే పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ మంత్రి పొంగులేటి ఇటీవల వ్యాఖ్యానించడంతో ఆ లోపే క్యాబినెట్ విస్తరణ కంప్లీట్ అవుతుందా?.. లేక మరోసారి వాయిదా పడుతుందా?.. అనే కొత్త కన్‌ఫ్యూజన్ ఆశావహుల్లో మొదలైంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితరాలతో పాటు ఇంకేం అంశాలు చర్చకు వస్తాయనేది పార్టీ నేతల్లో ఆసక్తికరంగా మారింది. సీఎంతో పాటు పీసీసీ చీఫ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కూడా సమావేశంలో పాల్గొంటున్నందున కీలకమైన అంశాలపై హైకమాండ్ దిశానిర్దేశం చేసే అవకాశమున్నది.