CM Revanth Reddy: అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేకంగా ముఖాముఖి అయ్యారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ‘లీడర్షిప్ ఇన్ 21 సెంచరీ’ కోర్సులో విద్యార్థిగా బిజీగా ఉన్నప్పటికీ, తనను కలవాలని కోరిన భారతీయ విద్యార్థుల విన్నపాన్ని మన్నించి సీఎం వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హార్వర్డ్ కెన్నడీ స్కూల్లో ఉదయం 7 గంటల నుంచే తరగతులు, కేస్ స్టడీస్, అసైన్మెంట్లతో అత్యంత బిజీగా గడిపిన ముఖ్యమంత్రి, ఆ అలసటను పక్కనపెట్టి విద్యార్థుల కోసం సమయాన్ని కేటాయించారు. ప్రధానంగా భారతీయ విద్యార్థులతో కూడిన ఈ బృందం సీఎంను తమ క్యాంపస్‌కు సాదరంగా ఆహ్వానించింది. విద్యార్థుల కెరీర్ మార్గాలు, వారు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సవాళ్లపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన తన జీవితానుభవాలను రంగరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విజయం అనేది కేవలం అదృష్టం వల్ల రాదని, స్పష్టమైన లక్ష్యం, నిరంతర కృషి ఉంటేనే సాధ్యమని సీఎం నొక్కి చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన నాయకత్వ లక్షణమని, వృత్తిపరమైన ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తనదైన శైలిలో వివరించారు.
తెలంగాణ రైజింగ్ –2047
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ ‘ విజన్‌ను ముఖ్యమంత్రి విద్యార్థులకు వివరించారు.హైదరాబాద్‌ను కేవలం ఐటీ రంగంలోనే కాకుండా, హెల్త్ కేర్, మౌలిక సదుపాయాల్లో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో రాబోతున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ చిరునామాగా మారుతోందని పేర్కొన్నారు.హార్వర్డ్ వంటి అత్యున్నత సంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు తమ మేధస్సును, గ్లోబల్ నెట్‌వర్క్‌ను భారత దేశ అభివృద్ధికి ఉపయోగించాలని సీఎం కోరారు. “మీరంతా విదేశాల్లో మన రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలి. ఇక్కడి అవకాశాలను, రాష్ట్ర బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి” అని సీఎం పిలుపునిచ్చారు.
Also Read: CM Revanth Reddy: మున్సిపోరులో క్లీన్ స్వీప్‌కు సీఎం ప్లాన్.. అమెరికా నుంచే వ్యూహాలు!

