Revanth Reddy on Rains:హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే అందుబాటులో ఉండాలని వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు.
భారీ వర్షం, ఈదురు గాలులతో హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని గుర్తుచేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్లపై నీటి నిల్వలు లేకుండా, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసి వాహనదారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని ఆదేశించారు. జిల్లాల్లో కూడా వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు