Golden Gopuram: యాదగిరిగుట్ట క్షేత్రం (Yadagiri Gutta) కొత్త రూపును సంతరించుకున్నది. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమానగోపురం (vimana Gopuram) సువర్ణమయమైంది. బంగారు తొడుగులతో (Gold Plated) స్వామివారి ప్రతిమ దేదీప్యమానంగా వెలుగుతూ ఆకర్షణీయంగా కనువిందు చేస్తున్నది. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణ విమాన గోపురంగా రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతుల (CM Revanth Reddy Couple) చేతుల మీదుగా ఆదివారం ఉదయం 11.54 గంటలకు స్వర్ణ విమాన గోపుర ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని (Inauguration Ceremony) నిర్వహించారు. అంతకుముందు రేవంత్ దంపతులకు వేదపండితులు (Priests) పూర్ణకుంభ స్వాగతం పలికి ఆశ్వీరాదం ఇచ్చారు. ఐదు రోజులుగా ఆలయ అర్చకులు, వేదపండితులు స్వర్ణ విమానావిష్కరణ, మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర తిరువీధిలో నరసింహహోమం, మహా కుంభాభిషేకంతోపాటు పంచకుండాత్మక యాగం నిర్వహించారు. హోమగుండాల మధ్యలో స్వామివారిని ఆవాహనచేసి ప్రతిష్ఠించి108 మంది రుత్వికులు వేదాలను ఆలపించారు. వానమామలై మధుర పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 60 మంది రుత్వికుల ఆధ్వర్యంలో ఈ క్రతువు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలావుంటే.. యాదగిరిగుట్ట ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు మాజీ సీఎం ఆలయ అధికారులు ఆహ్వానం పంపినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాలేదు.
జీవనదుల జలాలతో అభిషేకాలు
40 జీవనదుల జలాలతో గోపురానికి మహాసంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ క్రతువును వైదిక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించింది. గర్భగుడిలో సీఎం రేవంత్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వాదం ఇచ్చారు. అనంతరం స్వర్ణగోపురం భక్తులకు దర్శనమిచ్చింది.
స్వర్ణ విమాన రాజగోపురం ప్రత్యేకతలు ఇవే
ప్రధానాలయ పంచతల విమాన గోపురం 47 అడుగుల ఎత్తుతో రికార్డు సృష్టించింది. స్వర్ణ గోపురానికి ఆరడుగులఎత్తుతో సుదర్శన చక్రాన్ని రూపొందించారు. 16 కర్ణకూటములు, 16 ముఖశాలలు, నాలుగు మహానాసికాలు, 24 కేశమూర్తి, నాలుగు తార్ష్య, పక్ష్య, గరుడ, సుపర్ణ మూర్తులు, నాలుగు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ మూర్తులు, ఐదు నరసింహ మూర్తులు, 8 సింగంమూర్తులను రూపొందించారు. విమానంపై ఉన్న నరసింహ అవతారాలు, కేశవ నారాయణ, లక్ష్మీ, గరుడ మూర్తి రూపాలు భక్తులకు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేస్తున్నాయి.
నానో టెక్నాలజీ వినియోగం
ఈ విమాన గోపురం కోసం మహాబలిపురంలో రాగి తొడుగులను తయారుచేసి చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలను రూపొందించారు. గత ఏడాది దసరా రోజున స్వర్ణ తాపడం పనులు ప్రారంభించారు. ఇందుకోసం స్వామివారి హుండీల ద్వారా 1300 కిలోల వెండి, నగల రూపంలో వచ్చిన బంగారాన్ని వినియోగించారు. గర్భాలయంపై 49.5 అడుగుల ఎత్తు, 10,857 చదరపు అడుగుల మేర ఉన్న విమానానికి 68 కిలోల బంగారంతో తాపడం పనులు పూర్తి చేశారు. నానో టెక్నాలజీతో 24 క్యారెట్ల బంగారం తాపడంతో 50 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా పనులు చేశారు.