CM Revanth Reddy: ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా దావోస్‌లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మొదటి రోజు బిజీబిజీగా గడిపింది. అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం చర్చలు జరిపింది. ముందుగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు 2026లో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం బృందానికి విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్, ఇతర అధికారులు ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికి, మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో తెలంగాణ రైజింగ్ 2047 రోడ్ మ్యాప్‌ను ప్రపంచ వేదికపై పరిచయం చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరిస్తున్నారు.
ఏఐతో మెరుగైన పౌర సేవలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించి తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక ఆధ్వర్యంలో దావోస్‌లో నిర్వహించిన ‘ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కాంపిటీటివ్‌నెస్’ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగించారు. రైతు భరోసా వంటి సబ్సిడీల ట్రాకింగ్ నుంచి మొదలుకుని ఆస్తి పన్ను వసూళ్లు, మహిళలకు అందించే సంక్షేమ పథకాల అమలు, పట్టణ మున్సిపల్ సమస్యల పరిష్కారం వరకు అనేక రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. వ్యవస్థలోని మేధస్సే ఒకవైపు సమస్యగా, మరోవైపు పరిష్కారంగా మారుతున్నదని అభిప్రాయపడ్డారు. ఏఐ ని సరైన దిశలో వినియోగిస్తే పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని అన్నారు. అధునాతన ఏఐ యుగంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండ లేవని, ముందస్తు చర్యలు తీసుకోవడం, వేగంగా నిర్ణయాలు అమలు చేయడమే కీలకమని తెలిపారు.
Also Read: Naresh Birthday: నరేష్ 30 నిమిషాలు కేటాయిస్తే గొప్ప.. పవిత్ర లోకేష్.. ఏం చేస్తారంటే?
విజన్ డాక్యుమెంట్‌పై వివరణ
‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ముఖ్యమంత్రి వివరిస్తూ, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారిందని, అన్ని రంగాలకు చెందిన అగ్రశ్రేణి కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉండాలంటే మేధోవంతమైన వ్యవస్థలను నిర్మించాల్సిందేనని అన్నారు. డిసెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించిన రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌లో ప్రతిపాదించిన అభివృద్ధి నమూనాకు అనుగుణంగా సుస్థిర పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తమ అజెండా ఉంటుందని తెలిపారు.
కీలక ప్రముఖుల హాజరు
ఈ సదస్సులో స్మార్ట్ ఫ్యాక్టరీలు, స్థిరమైన ఇంధన వ్యవస్థలు, ఏఐ ఆధారిత సేవలు, స్మార్ట్ సిటీల నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలపై చర్చించారు. ఈజిప్ట్ పెట్టుబడులు, విదేశీ వాణిజ్య మంత్రి హస్సన్ ఎల్కహతీబ్, ఎమరాల్డ్ ఏఐ సీఈఓ వరుణ్ శివరామ్, ప్రపంచ మేధోసంపత్తి సంస్థ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, జర్మనీ డిజిటల్ మంత్రిత్వ శాఖ మంత్రి కార్ స్టెన్ వైల్డ్ బెర్గర్, నోకియా సీఈఓ జస్టిన్ హోటార్డ్, హిటాచి సీఈఓ తోషియాకి టోకునాగా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Also Read: Bhatti Vikramarka: అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు… డిప్యూటీ సీఎం భట్టి స్పష్టత

