CM Revanth Reddy: హైదరాబాద్ రవీంద్ర భారతిలో ‘ప్రజా ప్రభుత్వంలో కొలువుల జాతర’ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా జూ. లెక్చరర్ పోస్టులకు ఎంపికైన 1,532 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ .. నిరుద్యోగులకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలు గురించి వివరించారు. విద్యా వ్యవస్థ అభివృద్ధికి చేస్తున్న కృషి గురించి ప్రస్తావించారు. అదే సమయంలో విపక్ష బీఆర్ఎస్ (BRS) నేతలు కేటీఆర్ (KTR), కేసీఆర్ (KCR)లపై రేవంత్ విరుచుకుపడ్డారు.
కేటీఆర్, కేసీఆర్ పై సెటైర్లు
‘ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జూ.లెక్చరర్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన అనంతరం కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR)లపై విమర్శలు గుప్పించారు. తండ్రి, కొడుకుల ఉద్యోగాలు తీసేయడంతో మీకు ఉద్యోగాలు వచ్చాయంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం వైఫల్యం కారణంగా ఎంతో విలువైన 12 ఏళ్ల యుక్త వయసు వృథా అయ్యిందని రేవంత్ అన్నారు. తెలంగాణ అవతరణ తర్వాత నిరుద్యోగ సమస్య తీరుతుందని యువత భావించిందని పేర్కొన్నారు. పాదయాత్ర ప్రారంభించినప్పుడే యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని పిలుపునిచ్చానన్న రేవంత్.. ఆ దిశగా అడుగు వేస్తున్నట్లు చెప్పారు.
ఒక్కొక్కరికి రూ.40వేల ఖర్చు
ప్రభుత్వ పాఠశాలల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన రేవంత్.. అక్కడ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు స్కూళ్లతో ప్రభుత్వ బడులు ఎందుకు పోటీ పడలేకపోతున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు చేరడం లేదో సమీక్షించుకోవాల్సిన అవసరముందని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో 29, 550 స్కూల్స్ ఉన్నాయని వాటిలో 25 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నట్లు చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్లో ఒక్కో విద్యార్థికి దాదాపు రూ.40 వేలు ఖర్చు చేస్తున్నట్లు రేవంత్ తెలిపారు.
Also Read: Vijayasai Reddy: జగన్ గురించి.. ఆ నిజం చెప్పేసిన సాయిరెడ్డి.. అదేంటంటే?
ఏడాదిలో 50వేల ఉద్యోగాలు
అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్థిక పురోగతికి విద్యారంగం సోపానమన్న రేవంత్.. ఇప్పటి వరకూ ఆ రంగానికి రూ.21,650 నిధులు కేటాయించినట్లు చెప్పారు. విద్యా రంగంలో 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టామని చెప్పేందుకు గర్వపడుతున్నట్లు రేవంత్ అన్నారు.