CM Revanth Reddy
తెలంగాణ

CM Revanth Reddy: కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా?:సీఎం రేవంత్ రెడ్డి

నేనూ, భట్టి వస్తాం..
ప్లేస్ మీరు చెప్పినా సరే
ఎక్కడైనా.. ఎప్పుడైనా..
కిషన్‌ రెడ్డి వస్తే లెక్కలన్నీ చెప్తాం

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నదే ఆయన
మూసీకి డబ్బులు తెస్తే నేనే సన్మానిస్తా
కేసీఆర్‌ బాధపడతారనే సహకరించట్లేదు
పదేండ్లలో ప్రాజెక్టులను పండబెట్టింది కేసీఆరే
పూర్తయితే ఇప్పుడీ ఇబ్బందులెందుకు?
జీతం తీసుకుంటున్నా పని చేయట్లేదు
వర్గీకరణ పాత నోటిఫికేషన్లకు వర్తించదు
బీజేపీ కార్యకర్త తరహాలో మంద కృష్ణ తీరు
ఫండ్స్ కోసం అవసరమైతే ఢిల్లీలో ధర్నా
రాష్ట్రం కోసం 99 సార్లు వెళ్ళడానికైనా రెడీ
వెళ్ళిన ప్రతిసారీ పెండింగ్ వర్క్స్ క్లియర్
అసెంబ్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్‌చాట్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : రాష్ట్ర అవసరాలకు, అభివృద్ధి పనులకు, నిధుల కోసం 39 సార్లు కాకపోతే 99 సార్లయినా వెళ్తానని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా కూడా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యనించారు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్సులు తెచ్చుకుంటున్నామని, రాష్ట్ర అంశాలను కొలిక్కి తెస్తున్నామని స్పష్టం చేశారు. పదేండ్లలో తెలంగాణకు కేంద్రం నిధులు ఇచ్చిందంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారని, 2014 నుంచి కేంద్రం ఇచ్చిందెంతో.. ఇక్కడి నుంచి పన్ను వసూళ్ళ రూపంలో కేంద్రం తీసుకున్నదెంతో లెక్కలతో సహా వివరిస్తానని, ఆయనతో పాటు ఇంకెవరినైనా తెచ్చుకున్నా చర్చించడానికి తాము సిద్ధమని, ఆయన సిద్ధమా అని సవాలు విసిరారు. ఎక్కడకు రమ్మంటే అక్కడకు తాను, డిప్యూటీ సీఎం భట్టి వివరాలతో సహా వెళ్తామన్నారు.

కిషన్‌రెడ్డి నోట పచ్చి అబద్ధాలు
తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు ఇచ్చామంటూ పరేడ్ గ్రౌండ్ వేదికగా ప్రధాని మోదీ చెప్పారని, ఈ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హైదరాబాద్ మెట్రో రైల్ ఇచ్చామని చెప్పారని, అవి నిజమైతే ఎక్కడున్నాయని సీఎం రేవంత్ ప్రశ్నించారు. గతంలో జైపాల్‌రెడ్డి తీసుకొచ్చిన మెట్రో రైల్ సిటీలో కనిపిస్తున్నదని, కిషన్‌రెడ్డి తెచ్చింది ఎక్కడుందో కనబడడంలేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు భూ సేకరణ చేయకూడదనే డిమాండ్‌తో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కే. లక్ష్మణ్ ధర్నా చేస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోడానికే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించామని, దానికి కిషన్‌రెడ్డి డుమ్మా కొట్టారని, డిప్యూటీ సీఎం భట్టి నిజంగా హడావిడిగా పిలిచినందునే రాలేకపోతే గత నెలలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సమావేశం కూడా హడావిడిగా పెట్టిందేనా అని ఎదురు ప్రశ్నించారు.

కేసీఆర్ బాధ చూడలేకనే గైర్హాజరు
అఖిలపక్ష సమావేశానికి హాజరైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆగ్రహం కలుగుతుందనే ఉద్దేశంతోనే కిషన్‌రెడ్డి ప్రజాభవన్‌లోని ఆల్ పార్టీ మీటింగ్‌కు రాలేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెప్పిన చదువును ఇప్పుడు తమ దగ్గర చెప్పొద్దంటూ కిషన్‌రెడ్డికి హితవు పలికారు. రాష్ట్రానికి ఏమీ మేలు జరగొద్దని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని, దానికి కిషన్‌రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం సహాయ నిరాకరణ చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా రాష్ట్ర అభివృద్ధి పట్ల కిషన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులను తేవాలని డిమాండ్ చేశారు. గంగా, యమునా నదుల ప్రక్షాళనను సమర్ధించుకునే ఆయన, మూసీకి ఎందుకు అడ్డంపడుతున్నారని ప్రశ్నించారు. అధిక నిధులు ఇచ్చినట్లు నిరూపించినా ఇకపైన కొత్త నిధులు తీసుకొచ్చినా ఆయనకు గండపెండేరం తొడిగి సన్మానిస్తానని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా తీసుకురావాలన్నారు. .

రోజా రొయ్యల పులుసు తిని
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను పండబెట్టిందే కేసీఆర్ అని, ఆనాడే ఇవి పూర్తయ్యి ఉంటే ఇప్పుడు ఈ ఇబ్బందులే వచ్చి ఉండేవి కావని సీఎం రేవంత్ అన్నారు. పంటలు ఎండిపోతూ ఉంటే స్పైడర్ సినిమాలో విలన్ తరహాలో కేటీఆర్, హరీశ్‌రావు సంబురపడిపోతున్నారని, టన్నెల్‌లో మృతదేహాల ఆనవాళ్ళు బయటపడుతుంటే తీన్మార్ డ్యాన్స్ స్టెప్పులు వేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు ఇబ్బంది పడితే బాధపడడానికి బదులు సంతోషించే ఇలాంటి ముగ్గురు దుర్మార్గులు ప్రపంచంలో ఉంటారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్ళు లేకుండానే లక్షలాది ఎకరాల పంటలు పండుతున్నాయన్నారు. రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్నదెవరు.. రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పింది ఎవరు.. ప్రగతి భవన్‌లో జగన్‌కు పంచభక్ష పరమాన్నం తినిపించిందెవరు.. అని పరోక్షంగా కేసీఆర్‌పై సెటైర్ వేశారు.

కేసీఆర్‌ను బండకేసి కొట్టినం
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ని ఓడించింది, బండకేసి కొట్టింది, ఆయన్ను గుండుసున్నా చేసింది.. కాంగ్రెస్ పార్టీ, అప్పటి పీసీసీ చీఫ్‌గా ఉన్న తాను అని గుర్తుచేసిన సీఎం రేవంత్.. అడ్డగోలుగా మాట్లాడడంలో కేసీఆర్‌ను మించినోళ్ళు ఎవరున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్ పార్టీల్లో మునిగి మందు తాగితే స్టేచర్ వస్తుందా.. అంటూ కేటీఆర్‌ను ప్రస్తావించి తెలివి తక్కువ వాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సభకు వస్తే ముఖ్యమంత్రిగా తాను రిప్లై ఇస్తానని, కేసీఆర్‌ను విమర్శించేందుకు తన స్థాయి సరిపోదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటున్నా పనిచేయడంలేదని కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో అధికార పక్షం కంటే ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తున్నామన్నారు.

పాత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తించదు
ఎస్సీ వర్గీకరణ విషయంలో మంద కృష్ణ మాదిగ ఒక బీజేపీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నారని, పాత నోటిఫికేషన్లకు వర్గీకరణను వర్తింపజేయలేమని, పాత గైడ్‌లైన్స్ మార్చలేమని, కొత్త నిబంధనలు పెడితే లీగల్‌గా చిక్కులొస్తాయని, కోర్టులో ఆగిపోతాయని సీఎం రేవంత్ వివరించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా రాలేదన్నారు. మంద కృష్ణ అంటే వ్యక్తిగతంగా తనకు గౌరవం ఉన్నదని, కానీ వర్గీకరణ చేయనోళ్ళు ఆయన దృష్టిలో మంచోళ్లుగా, చేసిన తెలంగాణ ప్రభుత్వం చెడ్డదైందా అని ప్రశ్నించారు. వర్గీకరణపై చిత్తశుద్ధి ఉన్నందునే ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశామని, చట్టబద్ధత కల్పిస్తున్నామన్నారు.

అభ్యర్థుల ఎంపిక అధిష్ఠానం నిర్ణయం
పార్టీలో సంస్థాగతమైన నిర్ణయాలను అధ్యక్షులు తీసుకుంటారని, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అంశంలో పూర్తి స్వేచ్ఛ హైకమాండ్‌కే ఉంటుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో రేవంత్‌రెడ్డి పాత్ర లేదని, ఆయనను ఏఐసీసీ పక్కన పెట్టిందనే ఆరోపణలకు ఈ ముగ్గురి పేర్లను ఖరారు చేయడమే నిదర్శనమని కేటీఆర్ చేసిన కామెంట్లకు సీఎం రేవంత్‌పై విధంగా రిప్లై ఇచ్చారు. టికెట్లు రానప్పుడు నిరసన తెలియజేయడం సహజమని, అన్ని పార్టీల్లోనూ ఉంటుందని, కాంగ్రెస్‌లో ఎక్కువ ప్రజాస్వామ్యం ఉన్నందున దాని మోతాదు ఎక్కువే ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రభావంతోనే అన్ని పార్టీలూ బీసీలకు టికెట్లు ఇచ్చాయని పేర్కొన్నారు. హరీశ్‌రావు చేసిన మోసం వల్లనే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదని, కానీ కేటీఆర్‌, కిషన్‌రెడ్డి మాత్రం కలిసి తిరుగుతున్నారని నొక్కిచెప్పారు.

కేసీఆర్ చేసింది అప్పులు, తప్పులే
పడేండ్ల పాలనలో కేసీఆర్ చేసింది అప్పులు, తప్పులు మినహా ఇంకేమున్నాయని సీఎం రేవంత్ ప్రశ్నించారు. అప్పుల విషయంలో కేసీఆర్, కేటీఆర్ తప్పుడు గణాంకాలు చూపిస్తున్నారని, వాస్తవాలను ఆధారాలతో సహా నిరూపిస్తానని వ్యాఖ్యానించారు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికను అసెంబ్లీలోనే బహిర్గతం చేస్తామని తెలిపారు.

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?