CM Revanth Reddy: గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మక్తల్ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తినే సర్పంచ్ గా ఎన్నుకోవాలని సూచించారు. ఎవరో మాటలు నమ్మి ఫుల్లుకో, హాఫుకో ఓటు వేయవద్దని సీఎం సూచించారు. ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి.. తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని హితవు పలికారు. సర్పంచ్ మంచి వ్యక్తి అయితే ఊరు కూడా బాగుపడుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకులా మారి మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్పులను కడుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచితే వాటికి వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాని తెలిపారు. ఓవైపు అప్పులు కడుతూనే.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలలో అనేక వాటిని అమలు చేశామన్నారు.
మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే వాడినే సర్పంచ్ గా ఎన్నుకోండి. ఎవడి మాటలో నమ్మి ఫుల్లుకో, హఫుకో ఓటు వేయొద్దు. ఈ ప్రభుత్వంతో కలిసి పని చేసి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. సర్పంచ్ మంచోడు అయితే ఊరు బాగుపడుద్ది.
– సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/MBeSejl6F8
— BIG TV Breaking News (@bigtvtelugu) December 1, 2025
Also Read: Gram Panchayat Election 2025: మా బతుకులు మారట్లేదు.. 15 ఏళ్లుగా రోడ్డుకే దిక్కులేదంటూ.. సర్పంచ్ ఎన్నికల బహిష్కరణ
పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుందన్న సీఎం రేవంత్.. మోసగిస్తే మాత్రం పాతాళానికి తొక్కేస్తుందని సీఎం రేవంత్ వెల్లడించారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని గత పదేళ్లల్లో పట్టించునే నాధుడే లేకుండా పోయారని.. తాగునీరు అందించేందుకు గత పాలకులు ఎవరూ కృషి చేయలేదని సీఎం పేర్కొన్నారు. రెండు సంవత్సరాలలో నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఎవరైనా అడ్డుపడితే ఊరుకోమని చెప్పారు. ప్రాజెక్టు భూమి ఇచ్చిన రైతులకు రూ.20 లక్షల పరిహారం ఇస్తున్నట్లు చెప్పారు. ఆ డబ్బు ఇచ్చేందుకు ఎవరైనా లంచం అడిగితే వీపు విమానం మోత మోగించాలని ప్రజలకు సూచించారు.
తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకులా మారి కేసీఆర్ చేసిన అప్పులను కడుతూనే మీ అందరి కోసం ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నా
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి pic.twitter.com/CnBnGhKvGi
— BIG TV Breaking News (@bigtvtelugu) December 1, 2025
బహిరంగ సభకు ముందు మక్తల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల పరిధిలో రూ. 151.92 కోట్ల అభివృద్ధి పనులకు ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ. 15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులకు రేవంత్ శ్రీకారం చుట్టారు. అలాగే రూ. 121.92 కోట్లతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు, రూ.15 కోట్లతో అమరచింత మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులను రేవంత్ స్వయంగా ప్రారంభించారు.
