Betting Apps Case: బెట్టింగ్ యాప్ ల కేసులో సీఐడీ విచారణ పూర్తయ్యింది. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటివరకు దర్యాప్తులో వెల్లడైన వివరాలతో త్వరలోనే తుది నివేదికను రూపొందించనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఫైనల్ రిపోర్టులో ఏముంటుందో అన్న టెన్షన్ యాప్ లను ప్రమోట్ చేసిన వారిలో వ్యక్తమవుతోంది. కాగా, సిట్ అధికారులు మంగళవారం ఈ కేసులో నిందితులుగా ఉన్న టాలీవుడ్, బుల్లితెర నటీమణులు మంచు లక్ష్మి, రీతూచౌదరిలతోపాటు యూ ట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను మరోసారి విచారించారు.
కేసు విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు
పలువురి ఆత్మహత్యలకు కారణమవటంతోపాటు ఎన్నో కుటుంబాలను కోలుకోలేని దెబ్బ తీసిన బెట్టింగ్ యాప్ లపై మొదట్లో పంజగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆ తరువాత వీటిని సీఐడీకి అప్పగించారు. సీఐడీ ఉన్నతాధికారులు ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేశారు. ఇక, నిందితులుగా టాలీవుడ్, బుల్లితెర నటీనటులను సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించారు.
Also Read: Betting Apps Case: బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరైన మంచు లక్ష్మీ ప్రసన్న
ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు?
ఏయే యాప్ లను ప్రమోట్ చేశారు? ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? నగదు చెల్లింపులు ఎలా జరిగాయి? అన్న సమాచారాన్ని తీసుకున్నారు. దాంతోపాటు బ్యాంక్ అకౌంట్లు, లావాదేవీల సమాచారాన్ని కూడా సేకరించారు. తాజాగా మరోసారి మంచు లక్ష్మి, రీతూ చౌదరి, భయ్యా సన్నీయాదవ్ లను సీఐడీ కార్యాలయానికి పిలిపించి రెండు గంటలకు పైగా ప్రశ్నించారు. దీంతో ఈ కేసులో విచారణ ముగిసినట్టే అని అధికారుల ద్వారా తెలిసింది. త్వరలోనే ఫైనల్ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకు సమర్పించనున్నట్టు సమాచారం.
టెన్షన్ టెన్షన్
తుది నివేదికను తయారు చేసి కోర్టుకు సమర్పించనున్న నేపథ్యంలో బెట్టింగ్ యాప్ ల కేసులో నిందితులుగా ఉన్న సెలబ్రెటీల్లో కలవరం వ్యక్తమవుతోంది. ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు బెట్టింగ్ యాప్ ల కేసులోనే క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పతోపాటు బాలీవుడ్ నటులు సోనూ సూద్, నేహా శర్మ, ఊర్వశీ రౌతేలా తల్లితోపాటు టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుశ్ హజ్రాలకు చెందిన 7.93 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. సీఐడీలో నమోదైన బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇక్కడ కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఐఆర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటీనటులను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ కూడా చేశారు. ఈ క్రమంలోనే ఇక్కడ కూడా ఈడీ అధికారులు ఆస్తులను అటాచ్ చేస్తారా? అన్న సస్పెన్స్ నెలకొంది.
Also Read: Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం.. రానా, మంచు లక్ష్మికి పిలుపు

