Kavitha: కవితకు ‘చింతమడక’ ఆహ్వానం
బతుకమ్మకు రావాలని విజ్ఞప్తి
జాగృతి కార్యాలయానికి తరలివచ్చిన గ్రామస్తులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత గ్రామం చింతమడక ప్రజలు గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. కల్వకుంట్ల కవితతో (Kavitha) భేటీ అయ్యారు. పలు అంశాలు చర్చించారు. ఈ నెల 21న జరగనున్న ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు రావాలని ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, గొప్ప ఉద్యమకారుడిని కన్న గొప్ప ఊరు చింతమడక అని కొనియాడారు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి తనను బతుకమ్మకు రమ్మని కోరడం సంతోషంగా ఉందని కవిత చెప్పారు. తాను చింతమడక నుంచి ఎంతో నేర్చుకున్నానని ఆమె తెలిపారు. తాను చిన్నప్పుడు చింతమడకలో బతుకమ్మ ఆడిన రోజులు ఇంకా కండ్ల ముందే ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఈ సమయంలో గ్రామస్తులంతా వచ్చి తనకు ఇచ్చింది మామాలు ధైర్యం కాదని కొనియాడారు.
Read Also- Warangal District: రజాకార్లపై విరోచితంగా పోరాడిన యోధుల గాధ.. స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం
ఇటీవల కీలక పరిణామాలు
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi) ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ మరుసటి రోజే కవిత కూడా బీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎంఎల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌పై తీవ్రమైన అవినీతీ, కుట్రల ఆరోపణలు చేశారు. తెలంగాణ జాగృతి సంస్థ ప్రతినిధులు, బీసీ ప్రతినిథులు, మద్దతుదారులతో కలిసి తన తదుపరి రాజకీయ మార్గాన్ని నిర్ణయించుకుంటానని ఆ సమయంలో కవిత చెప్పారు. ఆమె కొత్త పార్టీ స్థాపిస్తారంటూ జోరుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ, ఇప్పటివరకు కొత్త పార్టీపై ఆమె స్పష్టత ఇవ్వలేదు.
Read Also- Hyderabad SHE Teams: గణేష్ ఉత్సవాలు.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన.. 1612 మంది పోకిరీల అరెస్ట్
ఆచితూచి వ్యవహరిస్తున్న బీఆర్ఎస్
కవిత సస్పెన్షన్‌పై మాట్లాడే విషయంలో బీఆర్ఎస్ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సొంత అన్న, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇటీవలే స్పందించారు, కానీ, పెద్దగా ఏమీ చెప్పలేదు. కవిత వ్యాఖ్యలపై పార్టీలో చర్చించాల్సింది చర్చించామని కేటీఆర్ చెప్పారు. కవిత వ్యాఖ్యల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నామని వివరించారు. కొత్తగా ఈ వ్యవహారంపై స్పందించాల్సింది ఏమీ లేదని ఆయన జవాబిచ్చారు. ఇక, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యవహారంపై పార్టీ నేతలతో అంతర్గతంగా చర్చించారు. కానీ, బహిరంగంగా ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కవితకు ఏం తక్కువ చేశామని, ఎందుకిలా మాట్లాడుతోందంటూ పార్టీ నేతల వద్ద అన్నట్టు కథనాలు వెలువడ్డాయి.
