Chinese Manja: సంక్రాంతి పండుగ అంటేనే పతంగులు గుర్తుకు వస్తాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా కలిసి గాలి పటాలు ఆకాశంలో ఎగురవేస్తుంటారు. కానీ, కొన్నేళ్లుగా ఈ పతంగులు కనిపిస్తే పై ప్రాణాలు పైనే పోతున్నాయి. పండగ పూట బయటకు రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరిగే పరిస్థితి కనిపిస్తున్నది. దీనికి కారణం చైనా మాంజా. వాహనదారులు, పాదచారులపై యమపాశంలా దూసుకొస్తున్న చైనా మాంజా ప్రాణాల మీదకు తెస్తున్నది.
చైనా మాంజా చుట్టుకుని వ్యక్తికి తీవ్ర గాయాలు
సంక్రాంతికి సంబురంగా ఎగరేసే పతంగులు ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నాయి. కైట్స్ ఎగురవేయడం కోసం ఉపయోగిస్తున్న చైనా మాంజా కలవరపెడుతున్నది. మనుషులే కాదు జంతువులు, పక్షుల జీవనానికి ఇబ్బందిగా మారింది. ఏటా ఎంతోమంది గాయపడుతున్నారు. చైనా మాంజాపై నిషేధం ఉన్నా మార్కెట్‌లో కొన్నిచోట్ల వీటి విక్రయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చైనా మాంజా చుట్టుకుపోవడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గచ్చిబౌలి – హఫీజ్ పేట రోడ్డులో జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న చైతన్య ఆదివారం తన బైక్‌పై గచ్చిబౌలి నుంచి హఫీజ్ పేట వైపు వెళ్తుండగా చైనా మాంజా ఎడమ చేతికి చుట్టుకుంది. దాంతో చేయి కోసుకుపోయి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దారిన వెళుతున్న వారు చైతన్యను మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్టు సమాచారం.
ఉప్పల్, నల్గొండలో కూడా..
హైదరాబాద్ ఉప్పల్‌లో కూడా చైనా మాంజా తగిలి సాయివర్ధన్ రెడ్డి అనే యువకుడు గాయపడ్డాడు. బైక్‌పై వెళ్తుండగా గొంతుకు మాంజా తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరిలోనూ మరో ఘటన చోటు చేసుకుంది. సభావల్ మధు అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి తిరుమలగిరికి బైక్‌పై వెళ్తుండగా విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న చైనా మాంజా చేతికి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు.
Also Read: MPTC Elections: సార్ మాకు ఇంకోక అవకాశం ఇవ్వండి.. పీసీసీ చీఫ్‌కు వెల్లువెత్తుతున్న వినతులు..?
జగిత్యాలలో నాలుగేళ్ల బాలుడికి గాయాలు
రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో చైనా మాంజా మెడకు చుట్టుకుని శ్రీహాస్ అనే నాలుగేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌కు తరలించగా మెడ చుట్టూ 20 కుట్లు పడ్డాయి. చైనా మాంజా ఎంత ప్రమాదమో ఇలాంటి ఘటనలు తరచూ నిరూపిస్తూనే ఉన్నాయి. ప్రతి ఏటా పదుల సంఖ్యలో సంక్రాంతి వేళ చైనా మాంజా కారణంగా గాయాల పాలవుతున్నారు. కేవలం మనుషులే కాదు నోరు లేని మూగజీవాలు బలికావలసి వస్తున్నది. చైనా మాంజా కారణంగా జంతువులు, పక్షులు విలవిల్లాడిపోతున్నాయి.
చైనా మాంజా యమ డేంజర్
చైనా మాంజా మారణాయుధంతో సమానం. నైలాన్ తాడు లేదా ప్లాస్టిక్ తాడుతో తయారు చేసే గాలిపటాల దారానికి పొడి గాజు ముక్కలు, మెటల్ పౌడర్, ఇతర ప్రమాదకర రసాయనాలు కలిపి పూతగా పూస్తారు. ఇది చాలా పదునుగా ఉంటుంది. ఎంత పదునుగా ఉంటుందంటే కత్తి కంటే షార్ప్. ఎలాంటి వస్తువునైనా కట్ చేస్తుంది. ఈ దారం ఇలా పదనుగా మారడంతో ప్రాణాల మీదకు వస్తున్నది. దానికి తోడు చైనా మాంజా నాన్ బయో డిగ్రీబుల్ అంటే భూమిలో కలిసిపోదు. పర్యావరణానికి కూడా హానికరం. పిల్లలు సరదాగా గాలిపటాలు ఎగురవేసే సందర్భంలో ఇతరుల గాలిపటాలు కట్ చేయడానికి ఈ చైనా మాంజాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాంతో తెగిన చైనా మాంజా గాలిలో ఎగిరిపోతూ బిల్డింగ్‌లపై, దారి వెంట వెళ్తున్న వారికి ప్రమాదకరంగా మారుతున్నది.
నిషేధం ఉన్నా కూడా..
చైనా మాంజా వాడకంపై ప్రభుత్వాలు నిషేధాలు విధిస్తున్నాయి. కొనుగోలు చేసినా, అమ్మినా అది నేరం. 2023లో వచ్చిన చట్టం ప్రకారం ఈ నేరానికి పాల్పడితే రూ.5 వేల జరిమానాతో పాటు సంవత్సరం పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. అయితే, విక్రయదారులు వీటిని బేఖాతరు చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల, ఇంకా ఇతర ప్రాంతాల్లో చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇవి గుట్టుగా జరుగుతున్నాయి. చైనా మాంజా కొనవద్దంటూ ఒకవైపు పోలీసులు ఎంత అవగహన కలిగిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. ఎన్ని ఆంక్షలు విధించినా ఇటు అమ్మే వారే కాకుండా కొనేవాళ్ళు కూడా పెడచెవిన పెడుతున్నారు.

