Central on Coaching Centers: రాబోయేది అడ్మిషన్ల కాలం. ప్రవేశాలకు ఎంట్రెన్స్ లు, అడ్మిషన్లతో బిజిబిజీగా ఉండనుంది. ఈ సమయం కోచింగ్ సెంటర్లకు వరంగా మారనుంది. పోటీ పరీక్షల్లో ర్యాంకుల పంట పండిందని.. తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సెంటర్లపై కేంద్రం కన్నెర్ర చేసింది. తప్పుడు సమాచారంతో విద్యార్థులను అడ్మిషన్ చేసుకున్న కోచింగ్ సెంటర్లపై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) కొరడా ఝుళిపించింది. ఇకపై పోటీ పరీక్షల ఫలితాల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తే ఖతమేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే దేశంలోని దాదాపు 24 కోచింగ్ సెంటర్లపై సీసీపీఏ ఉక్కుపాదం మోపింది. ఆయా ఇనిస్టిట్యూట్లకు జరిమానా సైతం విధించింది.
వివిధ కోర్సుల ఫలితాలు, ఎంట్రెన్స్ పరీక్షల ఫలితాలు రిజల్ట్స్ రానున్నాయి. కాగా విద్యార్థులను ఆకట్టుకునేందుకు పలు కాలేజీలు, కోచింగ్ సెంటర్లు యాడ్స్ ఇవ్వడం సర్వసాధారణం. అయితే టాప్ టెన్‌లో తమ విద్యార్థికే టాప్ ర్యాంక్ అని, వరుసగా ర్యాంకులన్నీ తమవేనని చెప్పడం కూడా సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కొన్ని కోచింగ్ సెంటర్లు, సంస్థలు మాత్రం తప్పుడు ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తున్నాయి. అలాంటి కోచింగ్ సెంటర్లపై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) యాక్షన్ తీసుకుంటోంది. ప్రధానంగా.. ఐఐటీ, జేఈఈ, నీట్, యూపీఎస్సీ లాంటి పోటీ పరీక్షల ఫలితాల్లో కొన్ని కోచింగ్ సెంటర్స్ ఫేక్ యాడ్స్ ఇచ్చినట్లు గుర్తించింది. అలాంటి యాజమాన్యాలపై చర్యలకు దిగింది.
తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న కోచింగ్ సెంటర్స్‌పై వినియోగదారుల రక్షణ చట్టం-2019ని సీసీపీఏ ప్రయోగించింది. ఫేక్స్ యాడ్స్ ఇస్తున్న దేశంలోని దాదాపు 24 కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా దాదాపు రూ.77 లక్షల జరిమానా విధించింది. పోటీ పరీక్షల ఫలితాల విడుదల తర్వాత తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. అన్ని కోచింగ్ సెంటర్లు రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచించింది.
కోచింగ్ సెంటర్స్ యాడ్స్‌లో అభ్యర్థి పేరు, ర్యాంక్, కోర్సు లాంటి కీలక వివరాలను క్లారిటీగా ప్రకటించాల్సిందేనని ఆదేశించింది. గతంలోనూ ఫేక్ యాడ్స్ జారీ చేసిన కోచింగ్ సెంటర్లకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటక్షన్ అథారిటీ జరిమానా విధించింది. మూడు కోచింగ్ సెంటర్లకు ఒక్కోదానికి రూ.7 లక్షల చొప్పున ఫైన్ వేసింది. మరో కోచింగ్ సెంటర్‌కు లక్ష జరిమానా విధించింది. ఇప్పటికైనా కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు తమ తీరును మార్చుకుంటాయా? లేక తప్పుడు ప్రకటనలు కంటిన్యూ చేస్తూ సీసీపీఏ చర్యలకు అవకాశం కల్పిస్తాయా? అనేది చూడాలి.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు