Hyderabad: లంచం తీసుకుంటుండగా తెలంగాణ ఇన్ కమ్ టాక్స్ కమిషనర్ (ఎగ్జెంప్షన్స్) జీవన్ లాల్ లావుడ్యాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు లంచంగా తీసుకున్న 70లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు జరిపి మరో 69లక్షల రూపాయల నగదుతోపాటు పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
జీవన్ లాల్ లావుడ్యా హైదరాబాద్ లోని ఇన్ కమ్ టాక్స్ కార్యాలయంలో కమిషనర్ (ఎగ్జెంప్షన్స్)గా పని చేస్తున్నారు. దీంతోపాటు అప్పీల్స్ యూనిట్లు 7, 8లకు ఇన్ ఛార్జ్ గా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కాగా, జీవన్ లాల్ లావుడ్యా పై అవినీతి ఆరోపణలు రావటంతో సీబీఐ అధికారులు ఆయనపై కొంతకాలంగా నిఘా పెట్టారు.
శనివారం ముంబయిలో 70లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జీవన్ లాల్ లావుడ్యా విచారణలో వెల్లడించిన వివరాల మేరకు శ్రీకాకుళంకు చెందిన సాయిరాం పాలిశెట్టి, విశాఖపట్టణానికి చెందిన నట్టా వీర నాగశ్రీ రాంగోపాల్, షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ ఇన్ కమ్ టాక్స్ డీజీఎం (టాక్సేషన్) విరాల్ కాంతాలాల్ మెహతా, ముంబయిలోని చెంబూర్ కు చెందిన సాజీదా మజహర్ హుస్సేన్ షాలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
Also read: Shrasti verma: తప్పు లేకపోతే నిరూపించు.. జానీ మాస్టర్ కి ఓపెన్ ఛాలెంజ్ చేసిన శ్రేష్టి వర్మ
ఈ క్రమంలో జీవన్ లాల్ లావుడ్యా , అదుపులోకి తీసుకున్న సాయిరాం పాలిశెట్టి, నట్టా వీర నాగశ్రీ రాంగోపాల్, విరాల్ కాంతిలాల్ మెహతా, సాజీదా మజహర్ హుస్సేన్ షాలతోపాటు మొత్తం 14మందిపై కేసులు నమోదు చేశారు. మధ్యవర్తులను పెట్టుకుని టాక్స్ మినహాయింపు కోసం వచ్చే దరఖాస్తులను ఆమోద ముద్ర వేయటానికి జీవన్ లాల్ లావుడ్యా పెద్ద మొత్తాల్లో లంచాలు తీసుకున్నట్టుగా విచారణలో వెల్లడైందని సీబీఐ అధికారులు తెలిపారు.
18చోట్ల తనిఖీలు..
అరెస్టుల తరువాత సీబీఐ అధికారులు వేర్వేరు బృందాలుగా విడిపోయి ముంబయి, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్టణం, న్యూ ఢిల్లీలోని 18చోట్ల తనిఖీలు జరిపారు. దీంట్లో పలు కీలకమైన డాక్యుమెంట్లతోపాటు 69లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు కొనసాగుతున్నట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. అరెస్ట్ చేసిన నిందితులను ముంబయిలోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరు పరచనున్నట్టు పేర్కొన్నాయి.
మాజీ ఎమ్మెల్యే కుమారుడు..
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీవన్ లాల్ లావుడ్యా 2004 బ్యాచ్ ఐఆర్ఎస్–ఐటీ అధికారి, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుమారుడు.