జనగణనలో కులగణన
పొలిటికల్ వెపన్!
బీజేపీ టార్గెట్‌గా కాంగ్రెస్ ‘మాస్టర్ స్ట్రోక్’
తెరపైకి ‘పార్లమెంటులో చట్టం’ డిమాండ్
ఆమోదిస్తే చాంపియన్‌గా తెలంగాణ సర్కార్
తిరస్కరిస్తే బీసీల నుంచి బీజేపీకి వ్యతిరేకత
జనాభా లెక్కల్లో కులాల లెక్కింపుపై పట్టు
కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్ధం
దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్‌పై చర్చ
తెలంగాణ నుంచి మొదలైన బీసీ ఉద్యమం
రాహుల్‌గాంధీ ‘బ్రెయిన్ చైల్డ్’గా కులగణన
మోదీపై రేవంత్ కామెంట్‌తో షాక్‌లో బీజేపీ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ‘బ్రెయిన్ చైల్డ్’ కులగణన (Cast Census) ఇప్పుడు బీజేపీ (BJP) కి సంకటంగా మారింది. కాంగ్రెస్ (Congress) విసిరిన మాస్టర్ స్ట్రోక్ (Master Stroke) ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. హామీ మాత్రమే కాక సక్సెస్‌పుల్‌గా అమలు చేశామని తెలంగాణ విధానాన్ని కాంగ్రెస్ చూపించదల్చుకున్నది. ఏడాది కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి కులాలవారీగా లెక్కలు తీశామని, వచ్చే నెల ఫస్ట్ వీక్‌లో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించిన తర్వాత చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth Reddy) ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదం కోసం పంపుతామని కూడా నొక్కిచెప్పారు. ఈ లెక్కలకు అనుగుణంగానే విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజికపరంగా అవకాశాలు కల్పిస్తామని, సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. రాజకీయాలకు తావు లేకుండా ఏకసభ్య కమిషన్ ద్వారా కులగణనను కంప్లీట్ చేయడంతో భవిష్యత్తులో లీగల్ చిక్కులకూ ఆస్కారం లేకుండా తెలంగాణ సర్కార్ పకడ్బందీగా వ్యవహరించింది. తెలంగాణలో నిర్వహించినట్టు.. కేంద్రం కూడా రాబోయే జన గణనలో కుల గణన నిర్వహించాలంటూ పవర్ పొలిటికల్ వెపన్‌ను కాంగ్రెస్ బయటకు తీసింది.
ఆత్మరక్షణలో బీజేపీ, ప్రధాని మోదీ :
కులగణనపై బీజేపీ తన రాజకీయ వైఖరిని వెల్లడించక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన చట్టానికి పార్లమెంటు ఆమోదం లభిస్తుందా? లేదా? అనేది కీలకంగా మారనున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆమోదిస్తే జాతీయ స్థాయిలో తెలంగాణ సర్కార్ చాంపియన్‌గా మారుతుందని, తెలంగాణలోని బీసీలకు ప్రయోజనం చేకూరుతుందని అదే సమయంలో రాహుల్‌గాంధీ ఫార్ములా సక్సెస్ అయినట్లవుతుందని అంటున్నారు. జాతీయ స్థాయిలోనూ ఇదే వైఖరి తీసుకోవాల్సిన ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఆమోదించకుండా ఈ చట్టాన్ని తిరిగి రాష్ట్రానికే పంపిస్తే దేశవ్యాప్తంగా బీసీల వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని, బీసీ వ్యతిరేక పార్టీ అనే అపవాదును ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. బీసీ సంఘాలు సైతం తప్పుపట్టే అవకాశాలున్నాయి. ‘బీసీ సీఎం’ స్లోగన్ ఇచ్చినా ఇప్పుడు కులగణన చట్టం విషయంలో భిన్నంగా వ్యవహరిస్తే ఆత్మరక్షణలో పడుతుందనే మాటలూ వినిపిస్తున్నాయి.
అంతిమంగా కాంగ్రెస్‌కే మైలేజ్ !
కులగణన చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపే విషయంలో బీజేపీ ఎలాంటి వైఖరి అవలంబించినా అది కాంగ్రెస్‌కు మైలేజ్‌గా మారే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమోదిస్తే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్ధించినట్లవుతుంది. వ్యతిరేకిస్తే స్వయంగా ప్రధాని మోదీ బీసీ కులానికి చెందినవారైనా మొండిచేయి చూపారనే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పార్లమెంటు ఆమోదించకపోవడానికి కారణాన్ని బీజేపీ వెల్లడించడం అనివార్యం కానున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీలపైనా, తెలంగాణ కులగణనపైనా బీజేపీ స్పష్టమైన వైఖరిని తీసుకోవడం తప్పనిసరిగా మారనున్నది. కులగణన లెక్కలు తప్పుల తడక అంటూ రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శిస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా సమగ్రమైన తీరులో కులగణన చేపట్టేలా ఆ పార్టీపైన బీసీ అంశాన్ని సమర్ధించే రాజకీయ పార్టీలు ఒత్తిడి తెచ్చే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు. ఇకపైన జరిగే బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఇష్యూ కీలకంగా మారనున్నది. బీజేపీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ సహా దాని మిత్రపక్ష పార్టీలు ఈ అంశాన్ని శక్తిమంతమైన పొలిటికల్ వెపన్‌గా జనంలోకి తీసుకెళ్ళే అవకాశమున్నది.
తెలంగాణ నుంచి బీసీ ఉద్యమం షురూ :
దేశవ్యాప్తంగా బీసీల ఉద్యమం తెలంగాణ నుంచే మొదలుకానున్నదని బీసీ సంఘాలకు చెందిన సీనియర్ ఉద్యమకారుడొకరు వ్యాఖ్యానించారు. ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన కులగణన చట్టమేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణన (సెన్సస్)లో కులగణన ఉండాలని సీఎం రేవంత్ ఇప్పటికే డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ సైతం చాలా కాలంగా ఇదే డిమాండ్ చేస్తున్నారు. బ్రిటిష్ హయాంలో జరిగిన కులగణన తర్వాత ఇప్పటివరకు కులాలవారీ లెక్కల్లేవని, ఇది లేకుండా ప్రజా సంక్షేమం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తెలంగాణ కులగణన చట్టం ఇతర రాష్ట్రాలకూ దిక్సూచిగా మారనున్నదని, అక్కడి పొలిటికల్ పార్టీల మొదలు బీసీ సంఘాల వరకు బీజేపీపై ఒత్తిడి పెంచడానికి దోహదపడనున్నదని సదరు బీసీ నేత చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ సైతం బీసీ ఇష్యూను టేకప్ చేయడంతో కులగణన చట్టానికి పార్లమెంటులో ఆమోదం విషయంలో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తుందా? లేదా? అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా జాతీయ స్థాయిలో బీజేపీ, రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ కులగణన విషయంలో కాంగ్రెస్‌కు టార్గెట్‌గా మారనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.