Case Filed on KTR: బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ అండ చూసుకొని కొందరు రెచ్చిపోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వికృతంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన మెుయినాబాద్ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. మెుయినాబాద్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ సహా మరో 8మందిపై కేసులు పెట్టారు. వారందరిపై బీఎన్ఎస్ 196, 352 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద వారిపై అభియోగాలు మోపారు.
కేటీఆర్ ప్రోద్భలంతోనే..
బీఆర్ఎస్ పార్టీకి చెందిన కె.విజయ్ రావు, డాక్టర్ కందుల మచ్చు, కె.యాదగిరి, రవికిరణ్, మురళి, అనిల్, వర్ధన్, అభి తదితరులు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదుదారుడు మానయ్య పోలీసులకు తెలిపారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రోద్భలంతో సీఎం రేవంత్ ప్రతిష్టకు భంగం కలిగేలా వారు అసభ్యకర రీతిలో మార్ఫింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫేక్ వీడియోలను సృష్టించి సోషల్ ప్లాట్ ఫాంలలో అప్ లోడ్ చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందటానికే వీళ్లంతా కలిసి కుట్ర చేస్తున్నట్లు పోలీసులకు తెలియజేశారు. వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని మానయ్య కోరారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన మెుయినాబాద్ పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో కేటీఆర్ అరెస్టు తప్పదని పొలిటికల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.