CP Sajjanar: సైబర్ బాధితులకు అండగా సీ-మిత్ర
CP Sajjanar ( image credit: swetcha reporter)
Telangana News

CP Sajjanar: సైబర్ బాధితులకు అండగా సీ-మిత్ర.. దేశంలోనే తొలిసారిగా అమలు : కమిషనర్ సజ్జనార్​!

CP Sajjanar: సైబర్​ బాధితులకు అండగా పోలీస్​ కమిషనరేట్​‌లో ‘సీ-మిత్ర’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు హైదరాబాద్​ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) ​ చెప్పారు. దీని ద్వారా ఫిర్యాదు ఇవ్వడంతోపాటు ఎఫ్ఐఆర్​ నమోదు వరకు బాధితులు ఇంటి నుంచే పూర్తి చేసుకోవచ్చని చెప్పారు. ఏఐ సాంకేతికత సహాయంతో ఆయా ఫిర్యాదులకు సంబంధించి పక్కాగా డ్రాఫ్ట్‌లు రూపొందిస్తామన్నారు. ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకురావడం దేశంలోనే తొలిసారని చెప్పారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా సైబర్ నేరాలకు పూర్తి స్థాయిలో కళ్లెం పడడం లేదని కమిషనర్ చెప్పారు. అత్యాశ, భయంతో ఎంతోమంది సైబర్ క్రిమినల్స్ ఉచ్చులో చిక్కుకుని డబ్బు పోగొట్టుకుంటున్నారన్నారు. ఇలాంటి బాధితులకు అండగా నిలుస్తూ వాళ్లు పోలీస్​ స్టేషన్​‌కు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించడానికి ఈ విప్లవాత్మక విధానాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఎఫ్ఐఆర్​ నమోదు ఇక ఈజీ

ఇది సైబర్ నేర బాధితుల కోసం ఏర్పాటు చేసిన వర్చువల్​ హెల్ప్​ డెస్క్ అని సజ్జనార్ చెప్పారు. సాధారణంగా సైబర్ మోసానికి గురైనప్పుడు బాధితులు 1930 నెంబర్​ లేదా, సైబర్​ పోర్టల్ www.cybercrime.gov.in కు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారన్నారు. అయితే, ఎఫ్ఐఆర్​ నమోదు కోసం కచ్చితంగా పోలీస్ స్టేషన్​‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నట్టు చెప్పారు. సీ-మిత్ర​ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇక ఆ అవసరం ఉండదన్నారు. ఫిర్యాదులో ఏం రాయాలి, ఏ సెక్షన్లు వర్తిస్తాయి అనే సందేహాలు బాధితుల్లో ఉంటాయని, ఇకపై సీ-మిత్ర బృందం స్వయంగా ఫోన్ చేసి వివరాలు సేకరించి ఏఐ సాంకేతికతతో పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్​ సిద్ధం చేసి బాధితులకు పంపిస్తుందని చెప్పారు. బాధితులు దానిని ప్రింట్​ తీసుకుని సంతకం చేసి సైబర్ మిత్ర హెల్ప్ డెస్క్, స్టేషన్​ హౌస్ అధికారి, క్రైం పోలీస్​ స్టేషన్​, బషీర్​ బాగ్​‌లోని పాత పోలీస్​ కమిషనర్​ కార్యాలయానికి పోస్ట్, కొరియర్​ ద్వారా పంపించవచ్చన్నారు. సైబర్ క్రైం పోలీస్​ స్టేషన్ల వద్ద ఉండే డ్రాప్ బాక్సుల్లో కూడా వాటిని వేయవచ్చని తెలిపారు. వీటి ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు ఎఫ్ఐఆర్​‌లు నమోదు చేస్తారన్నారు. ప్రస్తుతం ఈ సేవలు హైదరాబాద్​ కమిషనరేట పరిధిలో ఉంటున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు.

Also Read: CP Sajjanar: ప్రజల భద్రతే ముఖ్యం.. నిర్లక్ష్యాన్ని ఉపేక్షించను.. పోలీసులకు సజ్జనార్ క్లాస్!

ఫేక్ కాల్స్‌పై జాగ్రత్త

సీ-మిత్ర వల్ల పౌరుల సమయం ఆదా అవుతుందని సీపీ చెప్పారు. అదే సమయంలో సిబ్బందికి దర్యాప్తుపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంటుందన్నారు. 1930, జాతీయ సైబర్ పోర్టల్‌కు వచ్చే ఫిర్యాదుల్లో 18 శాతం మాత్రమే ఎఫ్​ఐఆర్​‌లుగా నమోదవుతున్నట్టు చెప్పారు. సీ-మిత్ర ద్వారా దీనిని వంద శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రూ.3 లక్షలలోపు మోసాలు జరిగిన కేసులను జీరో ఎఫ్ఐఆర్​ చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత పోలీస్​ స్టేషన్లకు ట్రాన్స్​ ఫర్​ చేస్తామన్నారు. రూ.3 లక్షలకు పైగా మోసానికి సంబంధించిన కేసులను సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లకు పంపిస్తామని తెలిపారు. 1930కి కాల్​ చేయడం, జాతీయ సైబర్​ క్రైం పోర్టల్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా సీ-మిత్ర సేవలను పొందవచ్చన్నారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే సీ-మిత్ర బృందంలోని వర్చువల్ అధికారులు బాధితులకు ఫోన్ చేసి అన్ని వివరాలను సేకరిస్తారని తెలిపారు. ఆ తరువాత ఫిర్యాదును సిద్ధం చేసి ఆ డ్రాఫ్ట్​‌ను బాధితులకు పంపిస్తారని చెప్పారు.

నకిలీ కాల్స్​ పట్ల అప్రమత్తంగా ఉండాలి

బాధితులు దానిని ప్రింట్​ తీసుకుని సంతకం చేసి పోస్ట్, కొరియర్​ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో డిజిటల్​ సంతకం ఆప్షన్‌ను కూడా అమలు చేయాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. వర్చువల్ హెల్ప్​ డెస్క్​ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. దీంట్లో 24 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఏఐ పరిజ్ఞానంతో సేవలు అందిస్తుందని చెప్పారు. సీ-మిత్ర అధికారిక ల్యాండ్ లైన్​ నెంబర్​ 040 41893111 నుంచి మాత్రమే ఫోన్​ కాల్స్​ వస్తాయని స్పష్టం చేశారు. వాట్సాప్ ద్వారా సమాచారం కేవలం 87126 సిరీస్​ నెంబర్ల నుంచి వస్తుందని చెప్పారు. సీ-మిత్ర పేర వచ్చే నకిలీ కాల్స్​ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సిబ్బంది ఎప్పుడూ ఓటీపీ నెంబర్లు, డబ్బు అడగరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ఈ విధానాన్ని అందుబాటులోకి తేవడంలో కీలకపాత్ర వహించిన అదనపు సీపీ (క్రైమ్స్​) ఎం శ్రీనివాసులు, సైబర్​ క్రైం డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతి బృందాన్ని కమిషనర్ అభినందించారు. దీనికి సహకరించిన ఐపీఎస్​ అధికారులు కారె కిరణ్​ ప్రభాకర్, కే అపూర్వ రావు, గైక్వాడ్​ వైభవ్ రఘునాథ్, రూపేశ్, వెంకటేశ్వర్లు ఇతర అధికారులను కూడా ప్రశంసించారు.

Also Read: CP Sajjanar: తాగి డ్రైవింగ్ చేస్తే వాళ్ళు టెర్రరిస్టులు: సీపీ సజ్జనార్

Just In

01

Jana Sena: జనసేన ఊహించని నిర్ణయం.. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి సై

Ponguleti Srinivas Reddy: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. గతం కంటే ఎక్కువ అక్రిడిటేషన్ కార్డులు

Cyber Fraud: రిటైర్డ్ ఐపీఎస్​ భార్యకు సైబర్ మోసగాళ్ల టోకరా.. ఎంత పని చేశార్రా!

Heavy Traffic: హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ.. డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షణ

Romeo Juliet Rule: రోమియో జూలియెట్ రూల్.. ‘పోక్సో’ దుర్వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన