BRS on Congress: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యంపై తెలంగాణ రైతాంగం తరపున పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంపై చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సారథ్యంలో త్వరలోనే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నది. పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యే ఈ ఉన్నతస్థాయి సమావేశంలో సాగునీటి ప్రాజెక్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అలసత్వం, రైతు వ్యతిరేక వైఖరిపై ప్రధానంగా చర్చించనున్నట్లు పార్టీ పేర్కొంది. మీడియా ప్రకటన విడుదల చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం
రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహించడంపైన చర్చించనున్నట్లు పార్టీ పేర్కొంది. బీఆర్ఎస్ పాలనలో 90 శాతం పూర్తి అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనబెట్టడంతో పాటు 2 పిల్లర్లు కుంగాయన్న సాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను నాయకులకు కేసీఆర్ వివరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో లక్షల ఎకరాల్లో రైతులకు సాగునీరు అందకుండా పోతున్నదని, రాజకీయ దురుద్దేశంతోనే అన్నదాతలపైన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్న నేపద్యంలో తదుపరి కార్యాచరణ పై చర్చించనున్నట్లు పార్టీ వెల్లడించింది.
తెలంగాణకు తీరని నష్టం
ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండా ప్రభుత్వం చూపుతున్న అలసత్వం వలన తెలంగాణకు తీరని నష్టం కలుగుతుందని, ఈ అంశంలో ఉద్యమ కార్యాచరణకు బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేయనుంది. ఏడాదిన్నర కాలంగా తెలంగాణ రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్ ద్రోహాన్ని ఈ కీలక సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సమగ్రంగా చర్చించనున్నట్లు పార్టీ ప్రకటించింది.
Also Read: PM Modi on Pahalgam attack: ప్రపంచ వేదికపై ప్రధాని మాస్ స్పీచ్.. పాకిస్థాన్‌కు ఇక మూడినట్లేనా!