తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : ఎమ్మెల్సీ ఎలక్షన్స్ (MLC Elections) లో సత్తా చాటేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహాలపై పార్టీ పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నదని, అందులో భాగంగానే బీజేపీ ముఖ్య నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగులు మొదలుపెట్టనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాషాయం గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతోనూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
మాసబ్ ట్యాంక్‌లోని ఓ హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో కీలక అంశాలు చర్చించి, పట్టభద్రులు, ఉపాధ్యాయులకు చేరువయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు పార్టీలోని కొందరు నేతలు పేర్కొంటున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
కాగా, ఆయా ఎన్నికలు జరిగే సెగ్మెంట్ల అభ్యర్థులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆఫీస్ బేరర్లతో శనివారం సమావేశం నిర్వహించి, ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections), లోకల్ బాడీ ఎన్నికల (Local Body Elections)పై కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పర్సన్ టు పర్సన్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా బీజేపీ సైలెంట్‌గా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతోనూ కిషన్‌రెడ్డి అధ్యక్షతన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారని సమాచారం.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లకు కేంద్ర మంత్రి దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్నది. ఈ ఎన్నికలు ఈ నెల 25న జరగనున్నాయి. అదేరోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే దీనిపై నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో పలువురు కార్పొరేటర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కాగా, ఆదివారం నిర్వహించే బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో కిషన్ రెడ్డి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన మరిన్ని వ్యూహాలను కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారని పార్టీలోని నేతలు చర్చించుకుంటున్నారు.