JubileeHills ByPoll Schedule: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఈ మేరకు సోమవారం ఉపఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ (JubileeHills ByPoll Schedule) విడుదలైంది. అక్టోబర్ 13న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 21 చివరి తేదీగా ఉంది. ఇక, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24 గడువు తేదీగా ఉంది. నవంబర్ 14న కౌంటింగ్ జరగనుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు.
బీహార్ నగారా మోగింది
యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశ నవంబర్ 6న, రెండో దశ నవంబర్ 11న జరగనుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సోమవారం ప్రకటించారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ (ఫలితాలు) ఉంటుందని వెల్లడించారు. ఈ షెడ్యూల్ విడుదల సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘బీహార్‌లో ఎన్నికలు నిష్పాక్షికంగా, చట్టబద్ధంగా జరిగేలా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని బీహార్ ఓటర్లకు తెలియజేయాలనుకుంటున్నాం’’ అని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.43 కోట్లు కాగా, ఇందులో సుమారు 14 లక్షల మంది తొలిసారి ఓటు వేయబోతున్న యువత ఉన్నారని ఆయన వెల్లడించారు.
ఓటర్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా, దరఖాస్తు అందిన 15 రోజుల్లోనే కొత్త ఓటర్ కార్డు జారీ చేసే కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చినట్టు ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తెలిపింది. జూబ్లీహిల్స్‌తో పాటు మరో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల తేదీలను కూడా ఈసీ ప్రకటించింది. జూబ్లీహిల్స్‌తో పాటు మిగతా అన్నిచోట్ల నవంబర్ 8న ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. జమ్మూ కశ్మీర్‌లో రెండు చోట్ల ఉపఎన్నిక జరగనుంది. ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా గెలిచి తర్వాత రాజీనామా చేసిన బుడ్గామ్ స్థానంతో పాటు మరో స్థానం ఉపఎన్నిక జరగనుంది. అదేవిధంగా, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, మిజోరం, ఒడిశాలో ఒక్కొక్కటి చొప్పున ఉప ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది.
బీహార్ హోరాహోరీ!
బీహార్ ఎన్నికల్లో అధికార బీజేపీ(BJP) – జేడీయూ పార్టీలు కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. మరోవైపు, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ పోటీ చేస్తోంది. ఈ రెండు కూటముల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడం ఖాయమంటూ విశ్లేషణల వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఓటర్ల జాబితా ప్రత్యేక పున:సమీక్ష ప్రక్రియ’ నేపథ్యంలో, విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయి.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 121 స్థానాలకు తొలి దశలో, మిగిలిన 122 స్థానాలకు రెండో దశలో పోలింగ్ జరుగుతుందని జ్ఞానేష్ కుమార్ వివరించారు. చాథ్ పండుగ (అక్టోబర్ 18 నుంచి 28 వరకు), దీపావళి పర్వదినాన్ని దృష్టిలో పోలింగ్ తేదీలు నవంబర్‌లో వచ్చేలా ఖరారు చేశారు. రాజకీయ పార్టీలు కూడా పండుగ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈసీ పరిగణనలోకి తీసుకుంది.
Read Also- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సై.. బీ ఫామ్ ల కోసం ఆశావహులు ప్రయత్నాలు
