Bandi Sanjay: గోపీనాథ్ ఎప్పుడూ చనిపోయాడో విచారణ జరిపించాలి
మాగంటి ఆస్తి కోసం కేటీఆర్, రేవంత్ కొట్లాడుతున్నారు
గోపీనాథ్ ఆస్తులను ఇద్దరూ పంచుకున్నారు
ఎంతెంత.. ఎవరిపై ట్రాన్స్ ఫర్ అయ్యోయో బయటపెట్టాలి
కేటీఆర్, రేవంత్ దోస్తులు
వారిమధ్య వ్యాపార లావాదేవీలు, ప్రాపర్టీ పంపకాలున్నాయి
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: భార్యలు ఎంతమంది ఉన్నా తల్లి ఒక్కరే ఉంటారని, సొంత కొడుకును హాస్పిటల్‌లో చూడనివ్వకుంటే ఆ తల్లి బాధ వర్ణనాతీతమని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మాగంటి గోపీనాథ్ అమ్మ బాధను చూసి తెలంగాణ సమాజం బాధపడుతోందని, ఆమెకు తన కొడుకును ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. కేటీఆర్‌పై ఆమె అనుమానముందని చెప్పిందని, దీని వెనుకున్న మిస్టరీ ఏంటనేది ప్రభుత్వం విచారణ చేపట్టి బయటపెట్టాలని బండి డిమాండ్ చేశారు. గోపీనాథ్ ఎప్పుడు చనిపోయారనేది విచారణ జరిపించాలన్నారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని సైతం విచారణ చేపట్టాలన్నారు. కేటీఆర్, రేవంత్ దోస్తులని, వారికి వ్యాపార లావాదేవీలు, ప్రాపర్టీ పంపకాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకే ఈ కారు రేస్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పక్కకు పోయాయని పేర్కొన్నారు.
మాగంటి గోపీనాథ్ ఆస్తుల విషయంలో కేటీఆర్, రేవంత్ రెడ్డికి గొడవలు మొదలయ్యాయని, అందుకే ఇద్దిర మధ్య పగలు, పట్టింపులు పెరిగిపోయాయని సంజయ్ వ్యాఖ్యానించారు. గోపీనాథ్ ఆస్తులను కేటీఆర్, రేవంత్ పంచుకున్నారని ఆరోపించారు. మాగంటి ఆస్తులు ఎవరి పేరిట బదిలీ అయ్యాయనే అంశాన్ని బయటపెట్టాలని బండి డిమాండ్ చేశారు. మాగంటి కుమారుడు చెప్పే ఆరోపణలపై విచారణ చేసే దమ్ము సీఎం రేవంత్ కు ఉందా? అని సవాల్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎందుకు గోపీనాథ్ కుమారుడి మాటలపై నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. ఎక్కడైనా ఆస్తి పంపకాల్లో కుటుంబసభ్యులు గొడవ పడుతారని, కానీ ఇక్కడ మాత్రం కేటీఆర్, రేవంత్.. మాగంటి ఆస్తుల కోసం కోట్లాడుతున్నారంటూ ఆరోపించారు. గోపీనాథ్ ఆస్తులు తనకు బదిలీ అవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి గుండెపై చెయ్యి వేసుకుని చెప్పగలరా? అని సంజయ్ నిలదీశారు. రానున్న మూడ్రోజుల్లో సర్వేల అంచనాలు తలకిందులు కాబోతున్నాయని బండి ధీమా వ్యక్తంచేశారు. హర్యానా, మహారాష్ట్రలో సర్వేలు బీజేపీ గెలవదని చెప్పాయని, కానీ అక్కడ కాషాయ జెండా ఎగిరిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ను గంజాయి దందా, చైన్ స్నాచర్స్ కు అడ్డాగా మార్చే ప్రయత్నం చేసతోందని విమర్శించారు. ఇది గుర్తించి ప్రజలు ఆలోచించి ఓటేయాలని సంజయ్ సూచించారు.
Read Also- Private Colleges Opening: రేపటి నుంచి ప్రైవేటు కాలేజీలు ఓపెన్.. వెనక్కితగ్గిన యాజమాన్యాలు
ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తారా? అంటూ బండి ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతినెల రూ.500 కోట్ల చొప్పున బకాయిలు చెల్లిస్తానని హామీ ఇచ్చి, టోకెన్లు ఇచ్చి మోసం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతే.. టోకెన్లు ఎందుకు ఇచ్చినట్లని నిలదీశారు. చట్టసభలో ఇచ్చిన హామీకే విలువ లేకుంటే ఇక అసెంబ్లీకి విలువ ఏముందని ఫైరయ్యారు. కాలేజీ యాజమాన్యాలపై సీఎంకు ఉన్న కోపంతో విద్యార్థుల జీవితాలను బలి చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని సంజయ్ర ఆరోపించారు. ఈ పథకాన్ని కొనసాగిస్తారా? ఎత్తేస్తారా? అనేది ప్రజలకు స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మొన్నటి వరకు తమకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్ సీ)తో పోటీ ఉండేదని, కానీ ఇప్పుడు తెలంగాణలో ఇండియన్ ముస్లిం కాంగ్రెస్(ఐఎంసీ)తో పోటీ ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తనదైన శైలిలో చురకలంటించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదన్నారు. ఫీల్డ్ నుంచి బీఆర్ఎస్ ఔట్ అయ్యిందన్నారు. జూబ్లీహిల్స్ లో ఐఎంసీ, బీజేపీ మధ్యే పోటీ ఉందన్నారు. అభివృధి కావాలో? అరాచకాలు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఎంఐఎం గెలిచినట్టేనన్నారు. కాంగ్రెస్ కు ప్రచారం చేసే నాయకులు లేరని, మొత్తం ఎంఐఎం నేతలే ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రచారంలో ఎక్కడ చూసినా పచ్చ జెండాలు కనిపిస్తున్నాయని, అవి ఎంఐఎంవా? పాకిస్తాన్ వా అర్థం కావడంలేదని ఎద్దేవాచేశారు.
Read Also- Vande Mataram: పెళ్లిలో వందేమాతర గేయం.. ఆసక్తికర సన్నివేశం
కేసీఆర్ మాదిరిగానే రేవంత్ కూడా దేశ సైనికులను అవమానపరుస్తున్నారని ఫైరయ్యారు. తమ క్యాంపెయింగ్ ను తట్టుకోలేక సభలకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తన సభకు అనుమతి ఇవ్వలేదని, బాధ్యతాయుతంగా ఉండే ఈసీ, పోలీసులు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. తమ సభకు అనుమతి ఇచ్చి చివరకు రద్దు చేశారని, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక మరో ప్రాంతంలో పెట్టుకోవాలని చెప్పారన్నారు. అదే బీఆర్ఎస్ డబ్బుల లెక్క కూడా రాయడంలేదన్నారు. బీఆర్ఎస్ నేతలు డీజే, ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టుకోవచ్చు కానీ తమకు మాత్రం అనుమతి ఇవ్వరా? అంటూ మండిపడ్డారు. డబ్బులు ఇచ్చి దొంగ సర్వేలు చేస్తున్నారంటూ ఫైరయ్యారు. ఏపీకి చెందిన సర్వే సంస్థకు బీఆర్ఎస్ రూ.2 కోట్ల డబ్బులిచ్చి సర్వే చేయించుకుందని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్.. ఇక్కడి సర్వే సంస్థలతో చేయించిందన్నారు.
