Av Ranganath | హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరో సంచలన ప్రకటన చేశారు. వ్యవసాయ భూముల్లో ప్లాట్లను కొనుగోలు చేయొద్దని చెప్పారు. అనధికారికంగా కొందరు వ్యవసాయ భూముల్లో ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారని.. చాలా మంది తెలియక అవి కొని ఇబ్బంది పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఎఫ్ టీఎల్ (ftl), బఫర్ జోన్ పరిధిలోని ప్లాట్లు, ఇండ్లను కొనొద్దని ఆయన చెబుతున్నారు. వాటి పరిధిలో కట్టిన ఇళ్లను అధికారులు కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా వ్యవసాయ భూముల్లోని ప్లాట్లను కూడా కొనద్దని చెప్పడం సంచలనం రేపుతోంది.
హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఇలాంటి ఫిర్యాదులు చాలా వచ్చాయి. రాజేంద్రనగర్ మండలం లక్ష్మీ గూడలోని 50వ సర్వే నెంబర్ లో ఎకరం 20 గుంటల వ్యవసాయ భూమిలో ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో ఏవీ రంగనాథ్ దీనిపై స్పందించారు. ‘వ్యవసాయ భూముల్లో అధికారికంగా ఉండే ప్లాట్లను మాత్రమే కొనాలి. కొందరు మోసగాళ్లు ప్రభుత్వానికి ఫీజు కట్టకుండా ఇష్టం వచ్చినట్టు గజాల చొప్పున అనధికార లేఅవుట్ తో ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారని’ రంగనాథ్ వెల్లడించారు.
‘వ్యవసాయ భూమిలో రూల్ ప్రకారం లేఅవుట్ తీసుకోవాలంటే ప్రభుత్వానికి ఫీజు కట్టాలి. అలా చేయకపోతే గజాల చొప్పున కాకుండా అద్ద ఎకరం చొప్పున అమ్మాలి. ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఎవరూ ఆ ప్లాట్లను కొనొద్దు. ఒకవేళ ఆ ప్లాట్లలో ఎవరైనా ఇళ్లు కట్టినా వాటిని కూల్చేస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు. రంగనాథ్ ప్రకటనతో వ్యవసాయ భూముల్లో ప్లాట్లు కొన్నవాళ్లు కూడా ఆందోళనకు గురవుతున్నారు. తాము కొన్న ప్లాటు లే అవుట్ ప్రకారం ఉందా లేదా అని తెలుసుకునేందుకు హైడ్రా ఆఫీసుకు క్యూ కడుతున్నారు.