AP Liquor Scam: రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఏపీ లిక్కర్‌స్కాం సెగ తెలంగాణకు కూడా తాకింది. దీనిపై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్న సిట్ అధికారులు హైదరాబాద్ (Hyderabad)లో నిందితులకు చెందిన నివాసాలతోపాటు కార్యాలయాలపై దాడులు చేసి సోదాలు జరిపారు. దీంట్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత(Andhra Pradesh) ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణం(Liquor Scam) ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపి వేస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Sunil Kumar Ahuja: అక్రమ ఫైనాన్స్‌లో జిత్తులమారి.. సునీల్ కుమార్ అహుజా!
దీనిపై విచారణ చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే దాదాపు 12మంది నిందితులుగా గుర్తించి అరెస్టులు కూడా చేశారు. కాగా, (Hyderabad)హైదరాబాద్‌లో వీరికి సంబంధించిన ఇండ్లు, ఆఫీసులపై దాడులు చేసి తనిఖీలు జరిపారు. రాజ్‌కసిరెడ్డికి చెంది ఖాజాగూడలో ఉన్న రీసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్, గోవిందప్ప ఆఫీస్ ఉన్న భారతీ సిమెంట్స్‌తో పాటు చాణక్యకు చెంది నానక్ రాంగూడలో ఉన్న చాణక్య టీ గ్రిల్ రెస్టారెంట్లలో సోదాలు చేశారు.
కీలక ఆధారాలు..
ఈ క్రమంలో సిట్ అధికారులు కీలక ఆధారాలను సేకరించినట్టుగా తెలిసింది. రాజ్ కసిరెడ్డితోపాటు ఆయన సహచరులు తరచూ విదేశీ పర్యటనలు చేసేవారని సిట్ విచారణలో ఇప్పటికే బయటపడ్డ విషయం తెలిసిందే. ప్రయాణ ఏర్పాట్ల కోసం రాజ్ కసిరెడ్డికి చెందిన రీసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ ద్వారా ఆద్య ట్రావెల్ ఏజన్సీకి 49లక్షలు ఒకసారి, కోటీ 42 లక్షలు ఇంకోసారి చెల్లింపులు చేసినట్టుగా సిట్ అధికారులు తనిఖీల్లో నిర్ధారించుకున్నట్టు సమాచారం.
ఇక, కిరణ్‌కుమార్ రెడ్డి 2021 నుంచి ఇటీవలి వరకు 28సార్లు విదేశాల్లో పర్యటించినట్టుగా వెల్లడైందని తెలిసింది. రాజ్ కసిరెడ్డి వద్ద పీఏగా పని చేస్తున్న పైలా దిలీప్బ్యాంక్ ఖాతాల్లో గడిచిన రెండేళ్లలో రూ.80లక్షలు క్రెడిట్ అయినట్టుగా తేలిందని సమాచారం. మద్యం ముడుపుల రూపంలో కొల్లగొట్టిన డబ్బును రాజ్‌కసిరెడ్డి ఆయన అనుచరులు హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలించినట్టుగా కూడా సిట్ దర్యాప్తులో వెల్లడైనట్టుగా తెలిసింది. ప్రధానంగా జింబాబ్వే, యునైటెడ్‌అరబ్ ఎమిరేట్స్, థాయ్‌లాండ్‌లలో పెట్టుబడులు పెట్టినట్టుగా తేలిందని తెలుస్తోంది. దీంట్లో రాజ్కసిరెడ్డితోపాటు ఆయన అనుచరులు చాణక్య, కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్అహ్మద్, సైమన్ ప్రసేన్‌లు కీలకపాత్ర వహించారని వెల్లడైనట్టుగా తెలుస్తున్నది.
Also Read: Telangana: ‘సిగాచీ’ దుర్ఘటనపై హైకోర్టులో మాజీ సైంటిస్ట్ పిల్