Amrabad Tiger Reserve: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మూసివేశారు. ఈ నెల 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పర్యాటకులకు ప్రవేశం నిషేధించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) మార్గదర్శకాలు, టైగర్ కన్సర్వేషన్ ప్లాన్ (టీసీపీ) సిఫార్సుల ప్రకారం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పర్యాటక కార్యకలాపాలు, ఇతర మానవ జోక్యాలను నియంత్రించేందుకు, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రిజర్వ్‌ను మూసివేయడం జరుగుతుందన్నారు.
ఈ నెల 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పర్యాటకులు, వన్యప్రాణి ఔత్సాహికులు, సాధారణ ప్రజల కోసం మూసివేస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం దీనికి సంబంధించి ప్రకటన విడుదల చేశారు. ఈ మూసివేతకు ప్రధానంగా భద్రతా, వన్యప్రాణుల సంతానోత్పత్తి, రిజర్వ్ నిర్వహణ, పునరుజ్జీవనం, వర్షాకాలంలో భారీ వర్షాలు కారణంగా ట్రయిల్స్ జారుడుగా మారడం, వరదలు సంభవించడం వంటివి పర్యాటకులు, అటవీ సిబ్బందికి ప్రమాదకరంగా ఉంటాయన్నారు.