Meenakshi Natarajan on Rajgopal: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీలో సరికొత్త చర్చకు దారితీశాయి. అసంతృప్తి, అసమ్మతి ఉంటే బహిరంగంగా కామెంట్ చేయొద్దని, పార్టీ అంతర్గత వేదికల్లోనే లేవనెత్తాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Nataraj) తొలి సమావేశంలోనే స్పష్టత ఇచ్చినా దాన్ని బేఖాతర్ చేసే తీరులో వ్యవహరించారన్న మాటలు జిల్లా పార్టీ నేతల్లో మొదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సైతం చెడును చెవిలో చెప్పాలి.. మంచిని మైక్‌లో చెప్పాలి.. అని పార్టీ లీడర్లు, కేడర్‌ను ఉద్దేశించి చెప్పినా అది కూడా బుట్టదాఖలా అయింది. తాజా తీరుతో ఢిల్లీ హైకమాండ్ (Delhi High Command) నుంచి పిలుపు వస్తుందా? ఇన్‌చార్జ్ మీనాక్షి స్పందిస్తారా? ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి.
అందుకే అలా మాట్లాడారా?
మంత్రివర్గ విస్తరణకు తాత్కాలిక బ్రేక్ పడడంతో అవకాశం చేజారిందన్న ఫ్రస్ట్రేషన్‌తోనే రాజగోపాల్‌రెడ్డి కాంట్రవర్సీ కామెంట్లు చేశారన్నది గాంధీభవన్ (Hyderabad Gandhi Bhava) వర్గాల భావన. ఒకవైపు ప్రభుత్వానికి కంచ గచ్చిబౌలి భూముల వివాదం తలనొప్పిగా మారిన సమయంలో పార్టీపరంగానూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజా వ్యవహారం తోడైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 15 నుంచి 23 వరకు జపాన్ పర్యటనకు వెళ్తున్నందున అప్పటివరకూ మంత్రివర్గ విస్తరణకు అవకాశాల్లేవ్. ఇటు ప్రభుత్వంలో.. అటు పార్టీలో నామినేటెడ్ పదవులు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గ కూర్పు తదితర అంశాలు పూర్తిస్థాయిలో కొలిక్కి రాని పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ దృష్టి సారించే అవకాశమూ లేదు. దాదాపుగా మంత్రివర్గంలో చోటు లభిస్తుందనే స్పష్టత నెలకొన్న సమయంలో అనూహ్యంగా బ్రేక్ పడడంతో రాజగోపాల్‌రెడ్డి నిరుత్సాహానికి గురయ్యారని, జానారెడ్డి (Jana Reddy) రాసిన లేఖతోనే మొత్తం ప్రక్రియ ఆగిపోయిందనే అంచనాతో దిగమింగుకోలేక బరస్ట్ కావాల్సి వచ్చిందని జిల్లా నేతల సమాచారం.
డిసైడ్ అయ్యారా?
రాజగోపాల్‌రెడ్డి ఒక్కసారిగా అసహనంతో సొంత పార్టీ నేతలను, సొంత జిల్లా నేతలను టార్గెట్ చేస్తూ విమర్శించడం పార్టీ నేతల్లోనే చర్చనీయాంశమైంది. మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాదనే అంచనాకు వచ్చారా? జానారెడ్డి లేఖతోనే ఆగిపోయిందని భావిస్తున్నారా? అందుకే ఆయనను ధృతరాష్ట్రుడితో పోల్చారా? మౌనంగా ఉండడం కంటే హైకమాండ్‌ను కమాండ్ చేసే స్థాయిలో వ్యవహరిద్దామని డిసైడ్ అయ్యారా? ఇచ్చిన హామీనే నిలబెట్టుకోవాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ఎత్తుగడా? ఇలాంటి ప్రశ్నలు జిల్లా పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ జట్టులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఉండడంలో తప్పులేనిది కాంగ్రెస్‌లో ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు మంత్రులు ఉంటే తప్పెలా అవుతుందని ప్రస్తావించడంతో ఉదయపూర్ తీర్మానం తెరమీదకు వచ్చింది. తాజా వ్యాఖ్యలు ఆయనకు మేలు చేస్తాయా? లేక చేటు తెస్తుందా? అనేది తాజా చర్చ.
ఎత్తుగడలో భాగమా?
మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందే హైకమాండ్ కావడంతో దానికి కట్టుబడి ఉండాలనే అస్త్రాన్నే రాజగోపాల్‌రెడ్డి ఎంచుకున్నట్లు తాజా వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. గట్టిగా డిమాండ్ చేయకుంటే మంత్రి పదవి వచ్చే అవకాశమే లేదనే ఎత్తుగడలో భాగంగానే ఈ కామెంట్లు చేశారన్న అనుమానమూ జిల్లా పార్టీ లీడర్లలో వ్యక్తమవుతున్నది. మంత్రి పదవి ఇవ్వాలంటూ బతిమలాడుకోవడం, ప్రాధేయపడడం కంటే కొట్లాడి సాధించుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్లు ఆయన మాటల్లోనే వ్యక్తమవుతున్నది. జానారెడ్డి మూడు దశాబ్దాల పాటు మంత్రి పదవులు అనుభవించి ఏనాడూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం ఉండాలని కోరలేదని, ఇప్పుడు తనకు ఇస్తారనే చర్చ జరుగుతున్నప్పుడే దీన్ని ప్రస్తావిస్తూ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. చివరకు తన అసహనాన్ని ధృతరాష్ట్రుడి పోలికతో వ్యక్తం చేయడంతో అడ్డం పడుతున్నది ఆయనేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లయింది.
Also Read: Bhu Bharati Portal: బాబోయ్.. భూ భారతి పోర్టల్ ను ఇంత బాగా డిజైన్ చేశారా? ఆ సమస్యలు తీరినట్లే!
హైకమాండ్ నుంచి పిలుపు తప్పదా?
పార్టీ లైన్‌కు భిన్నంగా బహిరంగంగా కామెంట్లు చేయడంతో ఢిల్లీ అధిష్టానం నుంచి రాజగోపాల్‌రెడ్డికి పిలుపు తప్పదా అనే గుసగుసలు మొదలయ్యాయి. హైకమాండ్‌పై ఒత్తిడి చేయాలన్న రాజగోపాల్‌రెడ్డి వ్యూహం ఫలిస్తుందా?.. లేక అందివచ్చే అవకాశం చేజారుతుందా?.. పార్టీ సీనియర్ లీడర్‌పైనే విమర్శలు చేయడం ఇబ్బందికరంగా మారుతుందా?.. ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకోక తప్పదా?.. ఇలాంటి చర్చలు మొదలయ్యాయి. రాజగోపాల్‌రెడ్డి తాజా వ్యాఖ్యలు ఆయనకు అడ్వాంటేజ్‌గా మారుతాయా?.. లేక మరిన్ని ఇబ్బందులను సృష్టిస్తాయా?.. వీటికి రానున్న రోజుల్లో క్లారిటీ లభించనున్నది.