ఆదిలాబాద్, స్వేచ్ఛ : ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలు అభివృద్ధి హామీలతో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. పాయల్ శంకర్ (ఆదిలాబాద్), ఏలేటి మహేశ్వర్ రెడ్డి (నిర్మల్), రామరావు పటేల్ (ముథోల్), పాల్వాయి హరీశ్ బాబు (సిర్పూర్-T) విజయం సాధించారు. అయితే, కేంద్ర నిధులు రాకపోవడం, కొత్త పరిశ్రమలు స్థాపన కాకపోవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections)లో ఇది ప్రతికూల ప్రభావం చూపుతాయేమోనని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో బీజేపీ జిల్లాలో కేవలం ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుచుకోగా, పాయల్ శంకర్ నియోజకవర్గంలో ఒక్కటీ సాధించలేకపోయారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి పరీక్షగా మారాయి.
ఆదిలాబాద్ నియోజకవర్గం..
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై అనేక హామీలు ఇచ్చినా అమలు జరగలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణ, ఎయిర్‌పోర్టు నిర్మాణం, ఆదిలాబాద్ – ఆర్మూర్ రైల్వే పనులు, 25 వేల ఉద్యోగాల కల్పన వంటి హామీలు నెరవేరలేదని మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరోపిస్తున్నారు. అదేవిధంగా, పట్టణ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి హడావిడి చేసినా, చివరకు మర్చిపోయారని ఆరోపణలు ఉన్నాయి.
గ్రామాలల్లో అభివృద్ధి చేయలేదన్న కారణంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ప్రత్యర్థులు కావాలని చేస్తున్న ప్రచారంగా కొట్టి పారేస్తున్నారు. బీజేపీ నాయకులు స్థానిక ఎన్నికల (Local Body Elections)లో తమ సత్తా చూపుతామని చెబుతున్నారు.
Also Read : కౌన్ బనేగా కమల దళపతి? కిషన్ రెడ్డి ఇలాకాలో రసవత్తర రాజకీయం!
సిర్పూర్ టి నియోజకవర్గం..
సిర్పూర్ టి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుండేలా చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, తన మాట నిలబెట్టుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పినా, ఇప్పటివరకు పురోగతి కనిపించడం లేదని ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన హామీ కూడా నెరవేరలేదు.
రవాణా సౌకర్యాలపై ప్రాధాన్యం ఇస్తామన్నా మారుమూల ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధి కాలేదు. ప్రజలు ఈ అంశాలపై సోషల్ మీడియాలో నిలదీస్తూ, నిధులు తీసుకురాలేకపోయిన కారణంగా అభివృద్ధి నిలిచిపోయిందని ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యతిరేకత ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అయితే, అభివృద్ధిలో వెనుకబడి ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్యే సమర్థించుకుంటున్నారు.
ముధోల్ నియోజకవర్గం..
ఎమ్మెల్యే రామారావు పటేల్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా కృషి చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. పద్నాలుగు నెలల పాలనలో ప్రగతి కనిపించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాసర టెంపుల్ సిటీ అభివృద్ధి, బైంసా పట్టణ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు వంటి హామీల్లో పురోగతి లేదు. ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతున్నది. బీజేపీ నాయకుడైన ఆయనపై పార్టీ వర్గాల నుంచే విమర్శలు వస్తుండడం గమనార్హం. ఈ వ్యతిరేకత లోకల్ బాడీ ఎలక్షన్స్ (Local Body Elections)లో ఆయనకు నష్టాన్ని కలిగించవచ్చనే ఆందోళన బీజేపీ వర్గాల్లో నెలకొన్నది.
నిర్మల్ నియోజకవర్గం..
నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న విమర్శలు ఉన్నాయి. కేంద్రం నిధులు సాధించడంలో విఫలమయ్యారని ప్రజల్లో అభిప్రాయం నెలకొన్నది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటులో పురోగతి కనిపించలేదు. స్థానిక ఎన్నికల్లో ఈ అంశాలు ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.
అయితే, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కాంగ్రెస్ బలహీనంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమరంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? లేదా ప్రతిపక్షాల వ్యూహాలకు గురై చతికిలపడుతుందా? అనేది వేచి చూడాలి.