ACB Raids: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై శనివారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. వేర్వేరు బృందాలుగా విడిపోయి రాష్ట్రవ్యాప్తంగా 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నదంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు గండిపేట, శేరిలింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోదాలు జరిపారు. ఈ క్రమంలో లెక్కల్లో లేని 2.51 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Also Read: ACB Raids: ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ మెరుపుదాడులు.. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు.. కారణమిదే!
కీలక డాక్యుమెంట్ల స్వాధీనం
తనిఖీల్లో 298 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను కనుగొన్నారు. వీటిని సంబంధిత వ్యక్తులకు ఇవ్వకుండా ఎందుకు కార్యాలయాల్లో పెట్టుకున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇక, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 19 మంది ప్రైవేట్ వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లు ఎలాంటి అనుమతులు లేకుండా సంచరిస్తున్నట్టు నిర్ధారించుకున్నారు. చాలా కార్యాలయాల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదని ఏసీబీ అధికారుల విచారణలో తేలింది.
సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో కూడా
13 మంది సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లపై కూడా దాడులు చేసిన అధికారులు పెద్ద మొత్తంలో నగదు, బంగారు నగలు, ప్రాపర్టీ డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ప్రస్తుతం వీటిపై విచారణ జరుగుతున్నది. దాడుల్లో వెల్లడైన అన్ని వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు అధికారులు తెలిపారు. అధికారికంగా సాయ పడేందుకు ఎవరు లంచం డిమాండ్ చేసినా 1064 నెంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. 9440446106 నెంబర్‌కు వాట్సాప్ కూడా చేయవచ్చన్నారు.
Also Read: ACB Raids: కాళేశ్వరం ఇంజనీర్‌కు బిగ్ షాక్.. రంగంలోకి ఏసీబీ.. 12 చోట్ల సోదాలు!
