ACB: అవినీతిపరుల పాలిట సింహ స్వప్నంలా నిలవాల్సిన ఏసీబీ కాగితం పులిలా మారిపోయింది. ఆమ్యామ్యాలకు మరిగిన అధికారులను అరెస్టులు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యమే ఇందుకు కారణం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల సంపదను పోగేసుకుని దొరికిపోయిన ఆఫీసర్లతోపాటు లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ పలువురు పొలిటికల్ గాడ్ ఫాదర్లు, ఉన్నతాధికారుల ఆశీర్వాదాలతో కేసులు పైళ్లకే పరిమితం అయ్యేలా చేస్తున్నారు. ప్రాసిక్యూషన్‌కు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారు. శాఖాపరమైన, ట్రైబ్యునల్ ఫర్ డిసిప్లనరీ ప్రొసీడింగ్స్‌కు కేసులు పరిమితమయ్యేలా చూసుకుంటున్నారు. ఇక్కడ కూడా కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. గమనించాల్సిన అంశం ఏమిటంటే ఏసీబీలోనే పని చేస్తున్న కొందరు అధికారులపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.
ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ
‘‘గవర్నమెంట్ జాబ్ దొరికితే లైఫ్ సెట్ మామా’’ ఇది నిరుద్యోగుల నోట తరచుగా వినిపించే మాట. లక్షల్లో జీతం ఉంటుంది. అందుకే జీవితంలో సెట్ అయిపోతారనుకుంటే పొరపాటే. ఆయా ప్రభుత్వ శాఖల్లో ప్యూన్ మొదలుకుని ఉన్నతస్థాయి అధికారుల వరకు చాలామంది ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డబ్బు లాగేస్తున్నారు. తమ తమ స్థాయిలను బట్టి అధికారికంగా సాయపడేందుకు లంచాలు తీసుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు.
ఫస్ట్ ప్లేస్‌లో పోలీస్
కొంతకాలం క్రితం ఓ స్వతంత్ర సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఎక్కువగా కరప్షన్ జరుగుతున్న డిపార్ట్మెంట్ల జాబితాలో పోలీస్ శాఖ అగ్రభాగాన నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయితీ, బ్లాక్ ఆఫీసులు, విద్యుత్ శాఖ, ఆర్టీవో ఆఫీసులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య, విద్యా, ఆదాయపు పన్ను, జీఎస్టీ శాఖలు నిలిచాయి. డెత్ సర్టిఫికెట్ కావాలన్నా, భూమికి పట్టా తీసుకోవాలనుకున్నా ఇలా ప్రతీ దాంట్లో లంచాలు సమర్పించుకోనిదే పని జరగని పరిస్థితి నెలకొని ఉన్నది.
Also Read: Bhatti Vikramarka: విద్య నైపుణ్యంతోనే అసమానతలు దూరం: భట్టి విక్రమార్క
నెలకు 10 కేసులు మాత్రమే..
ఇటువంటి పరిస్థితుల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పై సంపాదనలకు మరిగిన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలి. అయితే, ఈ లక్ష్య సాధనలో ఏసీబీ విఫలమవుతున్నదనే విమర్శలు ఉన్నాయి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ప్రకారం సేకరించిన వివరాల ప్రకారం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏసీబీ మొత్తం 621 కేసులు నమోదు చేసింది. అంటే సంవత్సరానికి 120. నెలకు 10 కేసులు మాత్రమే అన్నది సుస్పష్టం. నమోదైన కేసుల్లో అక్రమాస్తులు, ట్రాప్‌లు ఉంటున్నాయి. ఆయా కేసుల్లో ఏసీబీ అవినీతికి మరిగిన అధికారులను అరెస్టులు కూడా చేస్తున్నారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలిస్తున్నారు.
ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఎప్పుడు?
ఇలా పట్టుబడుతున్న అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి ఏసీబీ(ACB) అధికారులు ప్రభుత్వానికి లేఖలు రాస్తుంది. అయితే, కేవలం కొన్ని కేసుల్లో మాత్రమే లంచాలు తీసుకుంటూ అడ్డదారుల్లో కోట్ల రూపాయల సంపాదనను కూడబెట్టుకున్న అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతులు వస్తున్నాయి. అధిక శాతం కేసుల్లో ఇది జరగడం లేదు. దీనిపై సీనియర్ అధికారులతో మాట్లాడగా ముఖ్యంగా అవినీతి అనకొండలకు కొందరు రాజకీయ నాయకుల అండదండలు, పై ఆఫీసర్ల ఆశీర్వాదాలు ఉండడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తున్నది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల ఆస్తులు సమకూర్చుకుని పట్టుబడుతున్న అధికారులు అరెస్ట్ కాగానే వీరి ద్వారా పైరవీలు మొదలు పెడుతున్నారు. ప్రాసిక్యూషన్‌కు అనుమతులు రాకుండా చూసుకుంటున్నారు. ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారమే కేవలం 25 శాతం కేసుల్లో మాత్రమే అవినీతి అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతులు వచ్చాయి. మిగిలిన 75 శాతం కేసులు శాఖాపరమైన చర్యలు, ట్రైబ్యునల్స్‌కు బదిలీ కావడానికే పరిమితమైపోయాయి.
శిక్షలూ తక్కువే..
మరోవైపు, అవినీతి కేసుల్లో శిక్షల శాతం కూడా తక్కువగానే ఉంటున్నది. 2023 – 24లో న్యాయస్థానాల్లో కేవలం 19 కేసుల్లో మాత్రమే విచారణ పూర్తయ్యింది. వీటిల్లో 9 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి. 2024 – 25లో 22 కేసుల్లో మాత్రమే తీర్పులు రాగా 12 మందికి శిక్షలు పడ్డాయి. పలు కేసులు సాంకేతిక కారణాలతో వీగిపోతున్నాయి. దీంతో ఏసీబీ కేసులంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో భయం లేకుండా పోతున్నది. ఒకసారి పట్టుబడ్డా జైలు నుంచి విడుదల కాగానే పైరవీలు చేసి తిరిగి పోస్టింగులు తెచ్చుకుంటున్న కొందరు మళ్లీ అవినీతికి పాల్పడుతున్నారు. రెండోసారి కూడా దొరికిపోతున్నారు. దీనికి నిదర్శనంగా మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ బద్రూనాయక్ ఉదంతాన్ని పేర్కొనవచ్చు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు 2008, డిసెంబర్ 2వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ తరువాత బద్రూనాయక్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని లేఖ రాశారు. ఇది సచివాలయంలో 16 లలపాటు ఫైల్‌కే పరిమితమైంది. ఈలోపు బద్రూనాయక్ తిరిగి ఉద్యోగంలో చేరాడు. ప్రమోషన్ కూడా పొందాడు. ఇక, ఏసీబీ అధికారులు ప్రభుత్వ అనుమతితో 2011లో హైకోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. 15 ఏళ్లుగా ఈ కేసు న్యాయస్థానంలో నలుగుతూనే ఉన్నది. అయ
అప్పుడే భయం పుడుతుంది
అవినీతి అంటే ఉద్యోగుల్లో భయం పుట్టాలంటే ఆయా కేసుల్లో ప్రాసిక్యూషన్ కోసం అనుమతులను వేగంగా ఇవ్వాలని సీనియర్ అధికారులు అంటున్నారు. దీని కోసం రిటైర్డ్ జడ్జిలతో స్వతంత్ర ప్యానల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అదే సమయంలో కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా కేసుల్లో విచారణ వీలైనంత త్వరగా ముగిసి నిందితులకు శిక్షలు పడినప్పుడే ఏసీబీ కాగితం పులి కాదు అన్నది నిరూపణ అవుతుందన్నారు.
Also Read: Bhatti Vikramarka: బడ్జెట్ ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ.. జనవరి 3లోగా రిపోర్ట్ పంపాలని కేంద్రం ఆదేశం

