దూకుడు పెంచిన అవినీతి నిరోధకశాఖ
2024లో 152 కేసులు నమోదు
ఈ ఏడాదిలో ఇప్పటికే 27 కేసులు
బీఆర్ఎస్ పాలనలో అవినీతి అధికారుల ఇష్టారాజ్యం
నేతలను అడ్డుపెట్టుకొని కోట్లకు పడగలు
Acb | తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : కాంగ్రెస్ పాలనలో ఏసీబీ స్పీడ్ పెంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదుచేస్తున్నది. బీఆర్ఎస్ పాలనలో కొందరు అవినీతి అధికారులు ‘ఆడిందే ఆట పాడిందే పాట’గా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వందలకోట్లకు పడగెత్తారు. కాంగ్రెస్ (congress) పవర్‌లోకి రాగానే ఏసీబీ.. అవినీతి అధికారుల భరతం పడుతున్నది. గత ఏడాది(2024) రాష్ట్రంలో152 ఏసీబీ కేసులు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే 27 కేసులు నమోదు కావడం గమనార్హం. బీఆర్ఎస్ (brs) అధికారంలో ఉన్న పదేండ్లలో ఒక్క ఏడాది కూడా 100 మించి ఏసీబీ కేసులు నమోదు కాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. 2023లో నమోదైన కేసులు 92 మాత్రమే కావడం గమనార్హం. బీఆర్ఎస్ పాలనలో ఏసీబీ పెద్దగా యాక్టివ్ గా పనిచేయలేదు. ఏసీబీ అరెస్ట్ చేసింది చిన్నచేపలను మాత్రమే కావడం గమనార్హం.
అవినీతిలో పోలీస్‌శాఖ టాప్!
ఏసీబీ అధికారులు చెబుతున్న గణాంకాల ప్రకారం అవినీతిలో పోలీస్‌శాఖ టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో రెవెన్యూ, మున్సిపల్, అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ, నీటి పారుదలశాఖ నిలిచాయి. ఈ శాఖల్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న అధికారులు కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనికి నిదర్శనంగా రెరా కార్యదర్శిగా పని చేసిన శివ బాలకృష్ణ ఉదంతాన్నే చెప్పుకోవచ్చు. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన శివ బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టుగా ఫిర్యాదులో అందటంతో 2024 జనవరిలో ఏసీబీ అధికారులు రెయిడ్స్ చేశారు. తనిఖీల్లో బయటపడ్డ శివ బాలకృష్ణ ఆస్తుల చిట్టా చూసి అవినీతి నిరోధక శాఖ అధికారుల కళ్లు బైర్లు గమ్మాయి. శివ బాలకృష్ణ నివాసంతోపాటు అతని బంధువులు, బినామీల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో 300 కోట్లకు పైగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. 84 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 5.5 కిలోల వెండి, 3 విల్లాలు, 3 ఫ్లాట్లు, 90 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. తాజాగా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన గచ్చిబౌలి ఏడీఈ సతీశ్ సైతం వందల కోట్లు కూడబెట్టుకున్నట్టు ఎంక్వైరీలో తేలింది. ఇలా చెబుతూపోతే కోట్లకు పడగలెత్తిన అధికారుల లిస్ట్ చాంతాడంత ఉంది. పోలీసుశాఖలో ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇటీవల నారాయణపేట జిల్లా మక్తల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఓ కేసులో నిందితుడికి అనుకూలంగా చార్జ్ షీట్ మార్చేందుకు పోలీసులు 20 వేలు లంచం డిమాండ్ చేశారు. నిందితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సీఐ, కానిస్టేబుళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతకుముందు ధారూర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్ కూడా ఓ కేసులో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
ముఖ్యమంత్రి ఆదేశాలతోనే..
ప్రభుత్వశాఖల్లో అవినీతికి మరిగినవారు ఏ స్థాయి అధికారి అయినా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఏసీబీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే 2024 నుంచి ఏసీబీ అధికారులు వరుసగా దాడులు, అక్రమాస్తులకు సంబంధించిన కేసులను నమోదు చేస్తున్నారు. వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను సీజ్ చేస్తున్నారు. 2023తో పోలిస్తే 2024లో 60శాతం ఎక్కువగా కేసులు నమోదు కావటం గమనార్హం. ఈ సంవత్సరం ఒక్క జనవరి నెలలోనే 19 కేసులు రిజిస్టర్‌కాగా ఈనెలలో ఇప్పటి వరకు మరో 8 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో అరెస్టయిన నిందితులకు శిక్షలు పడేలా చూడటంలో కూడా ఏసీబీ అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే 2023తో పోలిస్తే 2024లో శిక్షలు పడ్డ కేసులు 64శాతం పెరిగాయి. ఏ శాఖలో ఎవరు లంచం అడిగినా వెంటనే 1064 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు.
ఆయా సంవత్సరాల్లో ఏసీబీ కేసుల వివరాలు
సంవత్సరం నమోదైన కేసులు
2022 98
2023 92
2024 152
2025 (ఇప్పటివరకు) 27