POCSO Case: నిందితుడికి 35 సంవత్సరాల జైలు శిక్ష
రూ.50 వేల జరిమానా విధింపు
బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలంటూ స్పెషల్ కోర్టు ఆదేశం
నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల, స్వేచ్ఛ: మైనర్ బాలికను మాయ మాటలతో లోబరుచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసగించిన కేసులో (POCSO Case) నిందితుడికి తగిన శిక్ష పడింది. 35 సంవత్సరాల జైలు శిక్ష, 50 వేల రూపాయాల జరిమానా, బాధితురాలికి 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించేలా శిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు మేజిస్ట్రేట్ రవి కుమార్ గురువారం తీర్పు వెలువరించారు.
ఎర్రవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక తండ్రి 2017 జూలై 2న కోదండాపూర్ పోలీస్ స్టేషన్‌లో మైనర్ అయిన తన కూతుర్ని నిందితుడు మాయ మాటలు చెప్పి, ఒక ఇంట్లో పెట్టుకున్నాడని, ఏడాది తర్వాత వేధింపులకు గురిచేశాడని పేర్కొన్నారు. విషయం తెలిసి తన కూతుర్ని ఊరికి తీసుకెళ్లానని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో పోలీసులు క్రైమ్ నంబర్ 61/2017 యూ/ఎస్ 366, 376(2),(ఐ)(ఎన్) ఐపీసీ సెక్షన్ 5(1) ఆర్/డబ్ల్యూ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012గా కేసు నమోదు చేశారు. నాటి డీఎస్పీ యాదగిరి విచారణ చేపట్టి విచారణ పూర్తి అయ్యాక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
Read Also- Gold Chain Theft: 4 తులాల గోల్డ్ చైన్ చోరీ.. 12 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు.. ఎలాగంటే?
కోర్టులో ట్రయల్స్ నడుస్తున్న సమయంలో జిల్లా అదనపు ఎస్పీ కే.శంకర్ ఆదేశాల మేరకు డీఎస్పీ మొగిలయ్య పర్యవేక్షణలో కోదండపూర్ ఎస్సై మురళి సాక్షులను పకడ్బందీగా చర్యలు తీసుకొని నేరస్తులను కోర్టులో ప్రవేశపెట్టారు. పూర్వపరాలను విన్న ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ మేజిస్ట్రేట్ ఎస్ రవి కుమార్, నిందితుడు చాకలి హరిచంద్రకు 35 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలిచ్చారు. రూ.50 వేల జరిమానా, మరో రూ.5 లక్షల పరిహారం బాధితురాలికి ఇచ్చేలా శిక్ష విధిస్తూ ఆయన తీర్పునిచ్చారు.
నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన ఇన్వెస్టిగేషన్ అధికారులు అప్పటి డీఎస్పీ యాదగిరి, ప్రస్తుత డీఎస్పీ మొగిలయ్య, ఎస్సై మురళీ అడిషనల్ పీపీలు శ్రీనివాస్, వినోద్ కుమార్, కోర్టు డ్యూటీ అధికారులు ఎస్సై జిక్కిబాబు, హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, కానిస్టేబుల్ ప్రదీప్, కిషోర్‌లను జిల్లా ఎస్పీ టీ.శ్రీనివాస రావు అభినందించారు.
