తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు ముగ్గురు జడ్జీలను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం అదనపు జడ్జీలుగా ఉన్న వీరిని పర్మినెంట్ జడ్జీలుగా నియమించాలని బుధవారం జరిగిన సమావేశంలో కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్, జస్టిస్ కళాసికం సుజన అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు. వీరిని పర్మినెంట్ జడ్జీలుగా ఎలివేట్ చేయాలని కొలీజియం నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తెలపగానే వీరు బాధ్యతలు తీసుకోనున్నారు. ఇటీవలే నలుగురు జ్యుడిషియల్ అధికారులను రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కొలీజియం తీసుకున్న నిర్ణయానికి ఆమోదం లభించింది. దీంతో ముగ్గురు అదనపు జడ్జీలు పర్మినెంట్ జడ్జీలయ్యేందుకు మార్గం సుగమమైంది.
