Jogipet Hospital: 12 మంది డాక్టర్లకు కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీ
జోగిపేట, స్వేచ్ఛ: జోగిపేటలోని ఏరియా ఆసుపత్రిని (Jogipet Hospital) రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ బుధవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో విధులకు గైర్హాజరు కావడం, ఆలస్యంగా వచ్చిన 12 మంది డాక్టర్లకు గురువారం నాడు ఆయన షోకాజ్ నోటీసులు జారీ జారీ చేశారు. ఈ విషయాన్ని డీసీహెచ్‌వో ఎండీ షరీఫ్ దృవీకరించారు. ఈ సందర్బంగా ఆయన ‘స్వేఛ్చ’తో మాట్లాడుతూ, డాక్టర్ వెంకటేశ్వరరావు, కే.హరీష్, దివ్యజ్యోతి, మేఘన, ఆనంద్‌నాయక్, ఎన్.సంఘమణి, బీ.శ్రీనివాస్‌రెడ్డి, శారదాదేవి, శివప్రసాద్, సుధారాణి, సల్మా, పూజాలకు నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. బుధవారం జోగిపేట ఆసుపత్రిని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసే సమయంలో మొత్తం 23 మంది డాక్టర్లుండగా కేవలం 4 డాక్టర్లు మాత్రమే విధులకు హజరయ్యారు. దీంతో కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం జరిగిందిదీ..
జోగిపేట,స్వేచ్ఛ: డ్యూటీకి రాకున్నా 15 మంది డాక్టర్లు బుధవారం విధులకు హజరైనట్లు డాక్టర్ల హాజరు రిజిష్టర్‌లో ఉండడాన్ని చూసిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జోగిపేటలోని వైద్య విధాన పరిషత్ ఏరియా ఆసుపత్రిని (Jogipet hospital) ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల్లోగానే ఆసుపత్రికి చేరుకున్న కమిషనర్ ముందుగా డాక్టర్ల హాజరు రిజిష్టర్‌ను తీసుకొని పరిశీలించారు. విధుల్లో ఉన్నట్లు అటెండెన్స్ రిజిష్టర్‌లో సంతకాలు చేసి ఉండడాన్ని గమనించారు. కానీ, డ్యూటీలో నలుగురు మాత్రమే ఉన్నారు. మిగతా వారు ఎక్కడున్నారంటూ కమిషనర్ ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.
Read Also- Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాపై ఇండస్ట్రీలో బిగ్ బజ్!.. హీరో ఎవరంటే?
డాక్టర్లను తప్పించేందుకు సిబ్బంది ప్రయత్నం చేస్తూ టీ తాగడానికి వెళ్లారంటూ ఆర్‌ఎంవో అశోక్ చెప్పారు. కమిషనర్ వచ్చిన తర్వాత ఆలస్యంగా వచ్చిన ఆర్‌ఎంవోపై కమిషనర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. కమిషనర్ ఆసుపత్రికి వచ్చిన తర్వాత విధుల్లోకి ఆలస్యంగా వచ్చిన అశోక్‌ను కమిషనర్ సిబ్బంది ముందే.. ‘‘అసలు మీకు సిగ్గుందా?, రోజుకొక పత్రికల్లో డాక్టర్ల నిర్లక్ష్యం, విధుల్లో గైర్హాజరీ వంటి కథనాలు వస్తుంటే మీరేం చేస్తున్నారు’’ అని నీలదీశారు. వచ్చిన 15 నిమిషాల్లో కమిషనర్ హల్ చల్ చేశారు. ఇన్చార్జి డాక్టర్‌గా ఉన్న రాజేశ్వరీ ఆసుపత్రి రోగుల వివరాలను కమిషనర్‌కు వివరించినా ఆయన సంతృప్తి చెందలేదు. కమిషనర్ రాకతో ఆసుపత్రిలో కాసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది. ఎక్కడి వారక్కడ అటెన్షన్‌లో ఉండే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికిని జోగిపేట ఆసుపత్రిలోని డాక్టర్ల పనితీరుపై మంత్రి దామోదర్ రాజనర్సింహ కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.

