– కరీంనగర్, సిరిసిల్లలో మాజీ సీఎం పర్యటన
– ఎండిపోయిన పంటల పరిశీలన
– కేసీఆర్ టూర్‌లో దొంగల చేతివాటం
– ఇద్దరు లీడర్ల జేబులు ఖాళీ
– రైతుల నుంచి స్పందన కరువు!
బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తేవడానికి కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతు మంత్రం జపిస్తున్నారు. వరుసగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ ఎండిన పంటలను పరిశీలిస్తున్నారు. స్థానిక రైతులకు భరోసా ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం కరీంనగర్‌లో పర్యటించారు. ముందుగా మొగ్దుంపూర్ వెళ్లారు. అక్కడ ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. రైతులతో కాసేపు మాట్లాడారు.
నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటునుంచి సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి వెళ్లారు కేసీఆర్. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం శాభాష్ పల్లి దగ్గర మిడ్ మానేరు రిజర్వాయర్‌ను పరిశీలించారు. బీఆర్ఎస్‌పై కక్ష గట్టి ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతలను బంద్ చేసిందని విమర్శించారు. అయితే, కేసీఆర్ పర్యటనలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఒక సర్పంచ్ జేబు నుంచి రూ. 25 వేలు, మరో ఉపసర్పంచ్ జేబు నుంచి రూ.15 వేలు కొట్టేశారు. పర్యటనలో రద్దీ పెరగడంతో దొంగలు ఇదే అదనుగా భావించి చేతివాటం ప్రదర్శించారు. మొగ్గుంపూర్ సర్పంచ్ జేబు నుంచి రూ. 25 వేలు, దుర్షేడ్ ఉప సర్పంచ్ జేబు నుంచి రూ.15 వేలు కొట్టేశారు. మొగ్దుంపూర్ పర్యటన తర్వాత కేసీఆర్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత సిరిసిల్లకు బయల్దేరి వెళ్లారు.
Also Read: తొలి తెలుగు యాంకర్ శాంతిస్వరూప్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల వేళ పార్టీ బలహీనపడుతుండటం కేసీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారుతున్నది. ఒక వైపు బిడ్డ కవిత జైలులో ఉండటం, కొడుకు కేటీఆర్‌పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడం, పార్టీ నమ్మిన బలమైన నాయకులు పక్క పార్టీలోకి వలస వెళ్లడం, ఇంకోవైపు సమీపిస్తున్న లోక్ సభ ఎన్నికలు, ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వవైభం తీసుకురావాలని కేసీఆర్ రంగంలోకి దిగారు. కానీ, రైతుల నుంచి కేసీఆర్‌కు స్పందన కరువైందని తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన పర్యటన మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గానీ ప్రారంభం కాలేదు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన నాయకుడు వస్తే, ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లీడర్ల హడావుడి తప్ప కేసీఆర్ టూర్‌లో అసలైన రైతులు పెద్దగా పాల్గొనలేదని అంటున్నారు. కేవలం ఫోటో షూట్లతో పర్యటన ముగిసిందని అనుకుంటున్నారు.