ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన కలయికగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడింది. టీడీపీ, జనసేన ఏకతాటి మీదికి రావడంతోనే ప్రతిపక్ష శిబిరంలో కొత్త ఉత్సాహం వచ్చింది. బీజేపీని కూటమిలోకి తేవడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. చివరి వరకూ సస్పెన్స్‌గానే ఉన్న ఈ కూటమి ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. కానీ, ఆశించిన స్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాణించలేకపోతున్నది. సీట్ల సర్దుబాటు విషయంలో, బీజేపీ ప్రచారంలో, రఘురామకు మొండిచేయి ఇవ్వడంలోనైనా కూటమి విమర్శలపాలైంది. ఇది ఎక్కడ బెడిసికొడుతుందోననే భయాలు ఉన్నాయి.
టీడీపీ పొత్తు జనసేన వరకే పరిమితమైతే బాగుండేది. బాబుకు పవన్‌తో కచ్చితంగా కలిసొచ్చే లాభాలున్నాయి. ఏపీలో అధిక జనాభా గల కాపు సామాజిక వర్గం ఇప్పుడు కూటమి వైపు మరల్చవచ్చు. వైసీపీ పార్టీపైనా పవన్ తీవ్రంగా విరుచుకుపడుతూ వ్యతిరేక ఓటును పెంచడంలో సక్సెస్ అవుతున్నారు. కూటమి గోదావరి జిల్లాల్లో సీట్లు పెంచుకోవడానికీ జనసేన ఉపయోగపడుతుంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కూడా ప్రజల్లోకి సానుకూలంగానే వెళ్లింది. కాపు, కమ్మ ఓట్లను ఈ పొత్తు కన్సాలిడేట్ చేయగలదు. సీఎం సీటు, సీట్ల సర్దుబాటు కూడా టీడీపీకి అనుకూలంగానే జరిగింది. కానీ, బీజేపీతో వ్యవహారం భిన్నంగా ఉన్నది.
ఏపీలో బీజేపీకి బేస్ లేకున్నా ఎక్కువ మొత్తంలో సీట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీనికితోడు బీజేపీతో టీడీపీ పొత్తు ప్రజల్లోకి పాజిటివ్‌గా వెళ్లడంలేదు. ఎన్డీయే నుంచి బయటకు వస్తూ గతంలో చంద్రబాబు చేసిన తీవ్ర విమర్శలు ఇప్పుడు పొత్తు నైతికతకు ఆటంకంగా మారాయి. అమరావతి రాజధాని, ప్రత్యేక హోదా అంశాలు కూడా టీడీపీ, బీజేపీ పొత్తును సవాల్ చేస్తున్నాయి. మొన్నటి చిలకలూరిపేట సభలో ప్రధాని మోడీ ప్రసంగంపైనా కూటమి శ్రేణుల నుంచే అభ్యంతరాలు వచ్చాయి. జగన్ పేరు ప్రస్తావించి విమర్శలు చేయలేదని, కనీసం చంద్రబాబు సీఎం కావాలనే ఆకాంక్షను కూడా వెల్లడించలేకపోయారని ఇప్పటికీ గుర్రుగానే ఉన్నాయి.
ఎన్నికలు సమీపించాయి. ఈ కొంతకాలంలో కూటమి లోపాలు సరి చేసుకోవాల్సి ఉంది. ఐక్యంగా కదులుతూ కూటమి సమైక్యతపై ప్రజల్లో అపోహాలను తొలగించాలి. గాలి మారడానికి రోజుల వ్యవధి చాలు. మొత్తంగా బాబుకు పవన్ వరమైతే.. బీజేపీ ఇప్పటికైతే శాపమే. ఈ కొంత కాలం టీడీపీ ఫ్యూచర్‌ను డిసైడ్ చేస్తాయనడంలో సందేహం లేదు.