– కేసీఆర్ మళ్లీ సైలెంట్
– సోషల్ మీడియాలోనూ నో యాక్టివ్
– మే 1 నుంచి ఎక్స్‌లో నో పోస్ట్
– నెల రోజులు అవుతున్నా 33వేల మంది ఫాలోవర్లే
X Account: నేటి రాజకీయాల్లో సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి పార్టీకి తప్పకుండా ఒక ఐటీ సెల్ మెయింటెయింన్ చేయక తప్పని పరిస్థితి. అలాగే, నాయకుల వ్యక్తిగత ఖాతాలు, పేజీలు నడుపుతుంటారు. అందుకోసం ప్రత్యేక సిబ్బంది కూడా పని చేస్తుంటారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా చురుకుగా ఉంటారని అందరికీ తెలుసు. సోషల్ మీడియా వేదికగా ఆయన చాలా విషయాలు పంచుకుంటూ ఉంటారు. ప్రజలను, ముఖ్యంగా యువతను చేరువ కావడానికి ఇది మంచి మార్గం. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ దారిని పార్లమెంటు ఎన్నికల ముందు ఎంచుకున్నారు.
మళ్లీ అదే తీరు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ప్రజల మధ్యకు వెళ్లడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. బస్సు యాత్రలు, సోషల్ మీడియా ఖాతా, టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇలా చాలా మార్గాల్లో ప్రయత్నించారు. తమ నాయకుడు ప్రజల్లోకి రావడం మంచిదని ఆయన అభిమానులు శుబపరిణామంగా అనుకున్నారు. కానీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే షరా మామూలే. కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో కూడా కేటీఆరే ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో కేసీఆర్ మళ్లీ తన దిశ మార్చుకున్నారా? అనే చర్చ జరుగుతున్నది.
సోషల్ మీడియాలో ఆరంభశూరత్వమే!
సోషల్ మీడియాలోనూ కేసీఆర్ ప్రెజెన్స్ మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఆయన అరంగేట్రం చేశారు. వచ్చిన రెండు రోజులకు తన ట్వీట్లతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపారు. కరెంట్ కోతల గురించి ఘాటైన ట్వీట్లు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సర్క్యూలర్ వివాదాన్ని రేపారు. ఈ వివాదం చినికి చినికి మన్నె క్రిశాంక్ అరెస్టు వరకు వెళ్లింది. ఆ తర్వాత మే 1న కార్మికులకు మేడే శుభాకాంక్షలు చెప్పి తన ఎక్స్ ప్రయాణానికి తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. కేసీఆర్ ఎక్స్ ఖాతా మొదలు పెట్టి నెల పూర్తి కావొస్తోంది. ఇన్ని రోజుల్లో ఏడు పోస్టులు పెట్టిన కేసీఆర్ మే 1వ తేదీ నుంచి మరే పోస్టూ పెట్టలేదు. ఓ టీవీ చానెల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన ఫొటోనే ఎక్స్‌లో ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకున్నారు.
ఫాలోవర్లు లేక ఆపేశారా?
ఇక కేసీఆర్‌కు ఉన్న ఛరిష్మాకు తగిన విధంగా ఎక్స్ ఖాతాలో ఫాలోయింగ్ రాలేదు. నెల రోజులు అవుతున్నా ఇంకా 33 వేల మంది ఫాలోవర్లు మాత్రమే వచ్చారు. అదే కేటీఆర్‌కు ఈ సంఖ్య 43 లక్షలు. కేసీఆర్ ఎక్స్ అకౌంట్ యాక్టివ్‌గా లేకపోవడం కూడా ఈ ఫాలోవర్ల సంఖ్య తక్కువగా ఉండటానికి ఒక కారణమై ఉండొచ్చు. కానీ, అభిమానులు చాలా వరకు ఆయన మాటలను వినాలనే కోరుకుంటారు. చూడాలి, కేసీఆర్ తీరు మారుతుందో లేదో.