- తీరు మార్చుకోని నరేంద్ర మోదీ
- మూడో సారి అధికారంలోకి వచ్చిన మోదీ
- సంకీర్ణంలోనూ నిరంకుశ నిర్ణయాలు
- మంత్రి వర్గ కూర్పులో అంతా పాతవారికే అవకాశం
- కేంద్ర క్యాబినెట్ లో ఒక్క ముస్లిం కైనా రాని మంత్రి పదవి
- సొంత పార్టీ పాతవారికే కీలక పదులు
- మోదీలో మార్పు రావాలని కోరుకుంటున్న సామాన్యులు
- ఎన్నికల ప్రచారంలోనూ ముస్లింలపై విషం కక్కిన మోదీ
- ఆర్ఎస్ఎస్ భావజాలాల నుండి బయటపడాలని మేధావులు సూచన
- Third time became Modi prime minister but not change behaviour:
సార్వత్రిక ఎన్నికలలో కోలుకోలేని దెబ్బ తిని మిత్ర పక్షాల పుణ్యమా అని మళ్లీ మూడో సారి అధికారంలోకి వచ్చారు మోదీ. ఈ ఎన్నికలలో ఎలాగైనా కాంగ్రెస్ కూటమికి చోటు లేకుండా చేయాలని చూసిన మోదీకి గట్టి షాకే ఇచ్చింది కాంగ్రెస కూటమి. ఏది ఏమైనా మోదీ గతంలో మాదిరిగా ఏక పక్ష నిర్ణయాలకు స్వస్తి చెబుతారని..ఆయనలో ఈ సారి మంచి మార్పే చూస్తామని లౌకిక, సామాజిక వాదులు భావించారు. అయితే మోదీ సంకీర్ణ మద్దతుతో గెలిచినా నిర్ణయాలు మాత్రం ఇంకా నిరంకుశంగానే తీసుకుంటున్నారని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి చూస్తుంటే మోదీలో ఎంతమాత్రం మార్పు రాలేదని సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు ప్రతిపక్ష నేతలు.
సమతూకం ఏది?
మోదీ క్యాబినెట్ మంత్రుల ఎంపికలో సమతూకాన్ని పాటించారా? అంటే లేదనే అనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పండితులు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మోదీ నేతృత్వంలో బీజేపీ మంత్రి మండలిలో మొత్తం 71 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ప30 మందికి కేబినెట్ హోదా ఇచ్చారు. ఓ 5 గురికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. 36 మందికి సహాయ మంత్రి హోదాని ఇచ్చారు. అయితే ఎక్కువ శాతం మంది పాతవారికే అవకాశం ఇచ్చారు మోదీ. వాళ్లలోనూ ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే ఎక్కువగా ఉండటం గమనార్హం. రాజనాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గట్కారి, జే.పీ. నడ్డా , శివరాజ్ సింగ్ చౌహన్, నిర్మలా సీతారామన్, జయశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, వీళ్లందరూ ఆర్‌ఎస్‌ఎస్ నుండి వచ్చిన వాళ్లే. పైగా ఏబీవీపీ కేడర్ ఎక్కువమంది ఉన్నారు. నరేంద్ర మోదీ తన పాత టీంకి బలమైన శాఖలు ఇచ్చారు.
మైనారిటీలకు మంత్రి పదవులివ్వరా?
ముస్లిం మైనారిటీ కి చెందిన ఏ ఒక్కరికీ మంత్రి పదవి దక్కలేదు. వాస్తవానికి ఎన్నికల సమయంలోనే ముస్లింలపై విషం కక్కిన మోదీ దానికి కొనసాగింపుగా పాలన సాగిస్తున్నారని రాజకీయ విమర్శకులు మోదీని ఎండగడుతున్నారు. ఎన్నికలకు ముందు ముస్లింలపై తనకు ఎటువంటి ద్వేషం లేదని మోదీ చెప్పారు. భారతదేశంలో 20 కోట్ల మంది పైగానే ముస్లింలు ఉన్నారు. భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర గణనీయమైనది. ముస్లింలు భారత టెక్నాలజీ రంగంలో ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి వారికి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇకపోతే రెండు సభల్లో సభ్యత్వం లేకపోయినా పంజాబ్‌కు చెందిన రణవీర్‌సింగ్ బిట్టూకు, కేరళకు చెందిన జార్జి కురియన్‌లకు మంత్రి పదవులు ఇచ్చారు. దీనిని బట్టి బీజేపీకి ముస్లింల పట్ల వ్యతిరేకత పోలేదని అర్థమవుతుంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లింలపై ద్వేష భావజాలాన్ని రెచ్చగొట్టారు. కాంగ్రెస్ పార్టీని ముస్లిం లీగ్‌తో పోల్చారు. అణగారిన వర్గాలకు భారత రాజ్యాంగం ఇస్తున్న సౌకర్యాలను ముస్లింలకు కాంగ్రెస్ ధారాదత్తం చేస్తుందని ఆరోపించారు. దేశ సంపద మీద మొట్టమొదటి హక్కు ముస్లిమ్‌ల దేనని కాంగ్రెస్ చెప్పినట్టు ప్రచారం చేశారు. దేశంలోని మైనారిటీలకు సాధికారత కల్పించవలసిన అవసరమున్నదని మన్మోహన్ సింగ్ 2006లో ఒక ప్రసంగంలో అన్న దానిని వక్రీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నిధులను ముస్లింలకు దోచిపెడుతున్నట్టు చూపే ఒక వీడియోను కాషాయ శక్తులు ప్రచారంలో పెట్టాయి. ఇంత తీవ్రంగా సాగిన ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు. అందుకే బీజేపీకి మెజారిటీని నిరాకరించి అతి పెద్ద పార్టీ స్థాయిని మాత్రమే ఇచ్చారు.
మార్పు రాకుంటే ఈసారి ఇంటికే
ఇప్పటికైనా మోదీలో మార్పు రావాలని జనం కోరుతున్నారు. పర మత విద్వేషానికి స్వస్తి చెప్పి సామాన్యుల బాగోగుల గురించి ఆలోచించాలి. అటు మిత్ర పక్షాలు, ప్రతిపక్ష నేతల సూచనలు, సలహాలు తీసుకోవాలని కోరుతున్నారు. నెహ్రూ మూడో సారి అధికారం చేపట్టిన ప్రధానిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడో సారి ప్రధానిగా గుర్తింపు కాదు అన్ని వర్గాలనూ కలుపుకుపోతే మళ్లీ నాలుగో సారీ ప్రధాని కాగలుగుతారు. బీజేపీ 400 టార్గట్ లక్ష్యానికి తూట్లు పడిందంటే అందుకు కారణం ముస్లిం ఓటర్లు దూరం కావడమే. జనాభాలో కేవలం 15 శాతం ఉన్న ముస్లింలను హిందువులు సైతం పరాయివారుగా చూడటం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా మోదీ ముస్లిం వ్యతిరేక ధోరణి మానుకుని సక్రమమైన పాలన అందిస్తారని అంతా భావిస్తున్నారు. మోదీ పాలనలోనే కాదు ఆయనలోనూ గణనీయమైన మార్పు రావాని అందరూ కోరుకుంటున్నారు.