- బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య రోజురోజుకూ పెరుగుతున్న అంతరం
- బీజేపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టిన ఆర్ఎస్ఎస్
- రెండు పర్యాయాలూ ఆర్ఎస్ఎస్ సేవలను ఉపయోగించుకున్న మోదీ
- మూడో సారి మాత్రం దూరంగా పెట్టిన ప్రభావం
- ఆర్ఎస్ఎస్ నేతలతో టచ్ లో ఉన్న నితిన్ గట్కరీ
- యూపీ ఎన్నికలలో బీజేపీకి సీట్లు తగ్గడానికి కారణం ఆర్ఎస్ఎస్
- మోదీని రీప్లేస్ చేయాలనే భావనతో ఉన్న ఆర్ఎస్ఎస్
- త్వరలోనే యోగి ఆదిత్యనాధ్ తో భేటీ
- మోదీ-అమిత్ షా ద్వయంపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఆగ్రహం
- బీజేపీ లో రాబోయే మార్పులపై రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ
RSS not support to BJP think to thought leadership of party :
మోదీ ఏక్ బార్ ఫిర్ అంటూ ఎన్నికల సంగ్రామంలోకి దూకింది బీజేపీ. ఈ సారి మిత్రపక్షాల అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితికి తెచ్చుకుంది. ఏ మాత్రం ప్రభావం చూపదు కాంగ్రెస్ కూటమికి 40 స్థానాల కన్నా ఎక్కువ రావని ఘంటాపథంగా ప్రచారం చేసిన బీజేపీకి వాళ్లు అనుకున్నదానికన్నా 200 స్థానాలు ఎక్కువగానే తెచ్చుకుంది కాంగ్రెస్ కూటమి. అయితే బీజేపీలో జరుగుతున్న పరిణామాలు సంచలనంగా మారాయి. వరుసగా రెండు పర్యాయాలు అధికారం ఒంటి చేత్తో సాధించుకున్న మోదీకి ఈ సారి జరిగిన ఎన్నికలలో అంత గట్టిగా షాక్ ఇచ్చిన అంశాలు ఏమిటని ప్రశ్నించుకుంటే ఇన్నాళ్లూ ఆ పార్టీకి అండదండలందిస్తూ వచ్చిన ఆర్ఎస్ఎస్ బీజేపీకి వెన్నుదన్నుగా నిలవకపోవడమే అని రాజకీయ పండితులు చెబుతున్నారు. వింటానికి షాక్ గా ఉన్నా అదే నిజం.
ఆర్ఎస్ఎస్ నేతల ఆగ్రహం
ఇన్నాళ్లూ బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం మోదీ-అమిత్ షా ద్వయమే అని జరుపుకున్న ప్రచారంపై ఎన్నికల ముందు నుంచే ఆర్ఎస్ఎస్ నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఇన్నాళ్లూ పార్టీకి సేవలందిస్తున్న నితిన్ గట్కారీని మోదీ-షాలు దూరం పెడుతూ వచ్చారు. ఎందుకంటే గట్కారీ కి ఆర్ఎస్ఎస్ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నికల ముందు నితిన్ గట్కరీనీ ఓడించాలనే ప్లాన్ లో భాగంగానే గట్కరీకి అనుకూలంగా ఉన్న 15 లక్షల ఓట్లను ఓటర్ జాబితాలో నుంచి మాయం చేశారనే అరోపణలు అప్పట్లో తెరపైకి వచ్చాయి. అయితే ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిచిన గట్కరీని మళ్లీ దగ్గరకు తీసుకుని మోదీ ఆయనకు పాత శాఖనే కట్టబెట్టారు. అయినా ఆర్ఎస్ఎస్ మాత్రం మోదీ విధానాలపై గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. అందుకే మోదీ స్థాయికి గట్కరీని తీసుకువచ్చేందుకు ఆర్ఎస్ఎస్ పావులు కదుపుతున్నట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు.
నాగపూర్ ఫ్లెక్సీలు
మూడోసారి నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని బీజేపీ స్పష్టం చేసిన వేళ ఆర్‌ఎస్‌ఎస్ కేంద్రమైన నాగ్‌పూర్‌లో బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మద్దతుగా హోర్డింగులు వెలిశాయి. నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆయన మద్దతుదారులు ఇవి ఏర్పాటు చేశారు. మోదీ సారథ్యంలో బీజేపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ సాధించని నేపథ్యంలో ఈ హోర్డింగుల పట్ల ప్రాధాన్యం నెలకొన్నది. నాగ్‌పూర్ నుంచి వరుసగా మూడోసారి నితిన్ గడ్కరీ గెలుపొందారు. దీనితో మోదీ-షా ద్వయం గట్కరీపై సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
యూపీ ఎన్నికలలో భారీగానే డ్యామేజ్
ఇక ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బీజేపీకి భారీగానే డ్యామేజ్ జరిగింది. అందుకు కారణం కూడా మోదీ ఆర్ఎస్ఎస్ మద్దతు కూడగట్టుకోలేకపోవడమే అని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో బీజేపీకి మద్దతు తెలపలేదని సమాచారం. సైద్ధాంతిక సంస్థగా ఉన్న ఆర్ఎస్ఎస్‌ని బీజేపీ పట్టించుకోకపోవడంతోనే ఇలా జరిగిందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ పరాజయానికి ఇది ఓ కారణంగా చెప్తున్నారు. యూపీలో మొత్తం 80 స్థానాలకు గానూ బీజేపీ కూటమి కేవలం 36 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ కూటమి ఏకంగా 43 స్థానాలలో విజయం సాధించింది. అయోధ్య అంశం అక్కడ ఎంత మాత్రం బీజేపీకి అనుకూలించలేదు. అందుకు ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ మద్దతు లేకపోవడమే అంటున్నారు.
యోగి-మోహన్ భగవత్ భేటీ
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మోదీ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోందని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. సమయం దొరికినప్పుడల్లా మోదీ కి పరోక్షంగా మోహన్ భగవత్ కౌంటర్లు ఇస్తునే ఉన్నారు. త్వరలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాధ్ తో మోహన్ భగవత్ భేటీ కానున్నారు. ఈ భేటీలో యూపీ ఎన్నికలలో ఓటమికి కారణాలు, మోదీ విధానాలపైనే చర్చలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మోదీ హవా తగ్గుతున్న నేపథ్యంలో నాయకత్వం మార్పుపైనా చర్చలు జరిగే అవకాశం లేకపోలేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి.