- జీ 7 శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్న మోదీ
- ఇటలీ పర్యటనకు ముందే ఉగ్ర సంకేతాలు
- ఇటలీలో గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన ఖలిస్తాన్ ఉగ్రవాదులు
- మోదీకి కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరికలు
- భారత జనాభాలో 2 శాతం పైగా ఉన్న సిక్కులు
- ప్రపంచంలోనే 5వ అతిపెద్ద మతంగా అవతరించిన సిక్కిజం
Modi attend G7 summit before Khalisthan terrorrists break Gandhi statue:
మూడోసారి ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టాక ప్రధాని మోదీ ఇటలీ పర్యటనకు వెళుతున్నారు. అక్కడ మూడు రోజులపాటు జరిగే జీ 7 శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు. దేశవిదేశఆధినేతలతో మోదీ చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనకు ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే మోదీ ఇటలీలో కాలుమోపకముందే అక్కడ ఖలిస్తానీ ఉగ్రవాదులు మోదీ రాకపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మోదీ రాకను వ్యతిరేకిస్తున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు. ఇటలీలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పైగా మోదీ ఇటలీకి వస్తే గాంధీ విగ్రహానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తున్నారు. పైగా గాంధీ విగ్రహం కింద ఏర్పాటు చేసిన దిమ్మపై తమకు మద్దతుగా అక్కడి స్థానిక భాషలో నినాదాలు రాశారు. హర్ దీప్ సింగ్ నిజ్జర్ పేరును వారు ప్రస్తావించారు. ఇదంతా తమ పనే అని ఖలిస్తాన్ టెర్రరిస్టులు చెబుతున్నారు. దీనితో భారత విదేశాంగశాఖ ఇటలీలో గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనను ఖండించింది. ఇటలీ కూడా దీనిపై స్పందిస్తూ బాధ్యులపై కఠినచరర్యలు తీసుకుంటామని చెబుతోంది. అయితే మోదీకి కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిందిగా ఇటలీ ప్రభుత్వాన్ని భారత విదేశాంగ శాఖ కోరుతోంది. ఈ నేపథ్యంలో మోదీ ఇటలీ పర్యటన ఉత్కంఠగా మారనుంది. ఖలిస్తాన్ ప్రభావం ఇటలీలో ఎందుకు అంతగా ప్రభావం చూపుతోంది? భారత్ లోని ఖలిస్తాన్ వేర్పాటు వాదులతో ఇక్కడి వారికి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
16వ శతాబ్దంలోనే సిక్కు మతం
ప్రపంచంలోనే అతి పెద్ద మతాలలో సిక్కు మతం ఒకటి. భారత్, పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ ప్రాంతంలో 16వ శతాబ్దంలో సిక్కు మతం పురుడుపోసుకుంది. 1947 లో దేశం వివిపోయిన తర్వాత ఇక్కడి పంజాబ్ తో సహా పాక్ లోనూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండున్నర కోట్ల మంది సిక్కుల వలన సిక్కు మతం కూడా పెద్ద మతాల సరసన చేరింది. ప్రపంచంలోనే సిక్కుమతం 5వ స్థానంలో ఉండటం గమనార్హం. అయితే ప్రపంచం మొత్తం మీద ఇండియాలోనే సిక్కుల సంఖ్య ఎక్కువ. భారత జనాభా 140 కోట్లు అయితే అందులో 2 శాతం సిక్కులున్నారు. అలాగే విదేశాలలోనూ సిక్కులు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారు. భారతదేశం తర్వాత సిక్కులు ఎక్కువగా ఉన్న దేశం కెనడా. అక్కడ 7.80 కోట్ల మంది సిక్కులు ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అమెరికా, బ్రిటన్లలో 5 లక్షలు, అస్ట్రేలియా లో రెండు లక్షల మంది సిక్కులున్నారు.
హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య
విదేశాల్లో సిక్కు జనాభా ఎక్కువగా ఉన్న కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ప్రభుత్వాల మీద భారత ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్న తీరు దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలకు కారణం అవుతోంది.సిక్కు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో వైఫల్యం సత్సంబంధాలకు అడ్డంకిగా మారుతుందని భారత ప్రభుత్వం బహిరంగంగానే చెబుతోంది. అయితే కెనడాలో ఖలిస్తాన్ నాయకుడు హర్ దీప్ సింగ్ నిజ్జర్ ని ఎందుకంతగా ఆరాధిస్తున్నారు.? ఇంతకీ ఎవరీ నిజ్జర్? హరదీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరసత్వం ఉన్న భారత సంతతి వ్యక్తి. వయసు 45 సంవత్సరాలు. గత ఏడాది జూన్ 18న బ్రిటీస్ కొలంబియాలోని సర్రే వద్ద ఓ సిక్కు గురుద్వార్ బయట ఆయనను బహిరంగంగా కాల్చిచంపారు నిందితులు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తక్షణమే భారత దౌత్య వేత్తను కెనడా నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొనడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అదే సమయంలో తమ దేశం వదిలి వెళ్లాలని కెనడా దేశ రాయబారులకు ఇండియా కూడా ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లాల్సిందిగా హెచ్చరించింది. అప్పటినుంచీ
భారత్-కెనడాల మధ్య సత్సంబంధాలు రోజు రోజుకూ క్షీణిస్తూ వస్తున్నాయి. అలా ఈ రెండు దేశాల మధ్య వివాదానికి ఆజ్యం పోసిన అంశం ఖలీస్థాని వేర్పాటు వాద నేత హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్య.
ఖలిస్తాన్ కు కెనడా పరోక్ష మద్దతు
భారత్‌లోని పంజాబ్‌లో జలంధర్‌కు సమీపంలో ఉన్న బార్సింగ్‌పూర్ అనే గ్రామంలో హరదీప్ సింగ్ నిజ్జర్ జన్మించారు. 1997లో కెనడా వెళ్లారు. మొదట్లో ఆయన వడ్రంగి పని చేశారు. తర్వాత బ్రిటిష్ కొలంబియాలో ప్రముఖ సిక్కు నాయకుడిగా ఎదిగారు. పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌తో సంబంధాలున్నాయని 2020లో భారత ప్రభుత్వం నిజ్జర్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే ఈ ఆరోపణలు ఆధార రహితమైనవని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. గతంలో చేసిన పోరాటం వల్లే ఆయన లక్ష్యంగా మారారని వారు చెబుతున్నారు.కెనడాలో ఆయన హత్య జరిగే సమయానికి, స్వతంత్ర సిక్కు దేశం కోసం ఇండియాలో అనధికారికంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు భారత మీడియాలో వార్తలు వచ్చాయి. ఇటీవల అనూహ్యంగా మరణించిన ప్రముఖ సిక్కు నాయకుల్లో నిజ్జర్ మూడో వ్యక్తి. ఇక ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆపడంలో కెనడా ప్రభుత్వం విఫలమైందంటూ ఢిల్లీ నాయకత్వం బహిరంగంగానే విమర్శిస్తోంది. ప్రస్తుత హింసను ఆపేందుకు ప్రయత్నిస్తానని, విదేశీ జోక్యాన్ని ఎంత మాత్రం సహించేది లేదని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అప్పట్లో ఓ ప్రకటన చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ ఇటలీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.