- దేశవ్యాప్తంగా జరిగిన యూజీసీ నెట్ పరీక్ష రద్దు
- నెట్ యూజీసీ సరీక్ష లీకేజ్ పై సీబీఐ విచారణకు ఆదేశం
- మరో పక్క నెట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు
- దేశ వ్యాప్తంగా కలవరపెడుతున్న పోటీ పరీక్షల లీకేజీలు
- గడచిన ఏడేళ్ల కాలంలో దాదాపు 70 పరీక్షలు లీక్
- కష్టపడే విద్యార్థులకు శాపంగా మారుతున్న పోటీ పరీక్షలు
- పేపర్ లీకేజ్ కాకుండా గ్యారెంటీ ఇవ్వలేకపోతున్న ప్రభుత్వాలు
- కఠిన చట్టాలు లేకపోవడంతోనే రెచ్చిపోతున్న లీక్ రాయుళ్లు
Education Ministry announces cancellation of UGC-NET CBI probe ordered:
ఒక పక్క నీట్ దేశవ్యాప్త పరీక్షలో అవకతవకలపై యావత్ దేశంలోని విద్యార్థిలోకి అట్టుడిగిపోతోంది. నీట్ పరీక్షను రద్దుచేసి తిరిగి నిర్వహించాలనే డిమాండ్ రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఇలాంటి తరుణంలో గోరుచుట్టు మీద రోకటి పోటులా మరో పరీక్ష లీకయి చివరకు రద్దు చేసే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా జరిగిన యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. మంగళవారం జరిగిన యూజీసీ నెట్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. పారదర్శకతను కాపాడటం కోసమే నెట్ పరీక్షను రద్దు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. నెట్ ఎగ్టామ్ పేపర్ లీకేజీ ఇష్ష్యూపై సీబీఐ విచారణ జరిపించాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ ేరకు సీబీఐ నెట్ పేపర్ లీకేజీపై దర్యాప్తు చేపట్టనుంది.
కలలు కల్లలవుతున్నాయి
అసలే ఇది పోటీ ప్రపంచం. చదువులకైనా, ఉద్యోగాలకైనా పోటీ పడాల్సిందే. అందుకే విద్యార్థులు, నిరుద్యోగులు రేయింబవళ్లు కష్టపడి ఎలాగైనా మంచి ర్యాంకు తెచ్చుకోవాలని సమాజంలో తోటి మిత్రులు, బంధువులలో అవమానాలు ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందో అని తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా కఠోర శ్రమతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని కలలు కంటారు. అయితే అలాంటి క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు, నిరుద్యోగులకు ఈ పేపర్ లీకేజీలు శాపంగా మారుతున్నాయి. రేయింబవళ్లు కష్టపడి చదువుకుని తీరా పరీక్షలకు సిద్ధమైతే..రాత్రికి రాత్రే లీకయిన పేపర్లు చూసుకుని దర్జాగా పరీక్ష రాస్తున్నవారి కారణంగా లక్షలు ఖర్చుపెట్టి పరీక్షలు రాస్తున్న వేలాది విద్యార్థుల బతుకు ఆగమైపోతోంది.
కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి నీట్ పరీక్ష రాసినవారిలో 67 మంది విద్యార్థులకు ఆలిండియా స్థాయిలో మొదటిర్యాంకు రావడమే కాకుండా.. ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు గాను 720 మార్కులు రావడం తీవ్ర అనుమానాలను రేకెత్తించింది. ప్రస్తతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
ఏడేళ్లలో 70 పరీక్షలు లీక్
దేశంలో అనేక మంది విద్యార్థుల భవితవ్యాన్ని పరీక్ష పత్రాల లీకేజీలు దెబ్బతీస్తున్నాయి. దీనికి చాలా పెద్ద చరిత్రే ఉన్నది. దశాబ్దాల చరిత్ర సంగతి పక్కన పెడితే.. గడిచిన ఏడేళ్ల వ్యవధిలోనే దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో సుమారు 70కిపైగా వివిధ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇవి దాదాపు కోటిన్నర మంది యువత కెరీర్‌లను ప్రభావితం చేశాయని అంచనా. వీళ్లంతా ఏదో ఒక మతానికో, కులానికో, వర్గానికో, ప్రాంతానికో చెందినవారు కాదు. వీరంతా భారతీయ యువత. భావిభారతానికి పునాదిరాళ్లు. ఎన్నెన్నో ‘గ్యారంటీ’లు ఇస్తున్న పాలకులు, పార్టీల నేతలు పేపర్ లీకేజీలను అంతమొందిస్తామని ఎందుకు గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారన్నది ప్రశ్నగానే ఉండిపోతున్నది.
కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు
భారతదేశంలో ఎక్కువ శాతం మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. వీళ్లలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక డ్రీమ్. అందుకే డిగ్రీ పూర్తికాగానే కనీసం రెండు నుంచి మూడేళ్ల దాకా ఏదో ఒక సర్కారు కొలువు టార్గెట్ కొట్టితీరాలని సంబంధిత పరీక్షల కోసం చమటోడుస్తుంటారు. వాళ్ల కష్టమంతా లీకేజీల కారణంగా బూడిదలో పోసిన పన్నీరు గా మారుతోంది.
. ఎన్నటికీ తిరిగి రాని వెచ్చించిన సమయం, చేసిన ఖర్చు, పడిన శ్రమ.. అంతా వృథా అవుతున్నది. పరీక్ష పత్రాల లీకేజీలను నివారించేందుకు, నిరోధించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తున్నప్పటికీ.. చేయాల్సింనంత కృషి లేదని పలువురు విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. పేపర్ లీక్ అయిన ప్రతిసారి మొక్కుబడిగా ఒక విచారణ జరిపించడం, కోర్టు కేసులు, వాయిదాలు, వాటిపై విద్యార్థుల ఆగ్రహాలు, ధర్నాలు.. ఇదొక రొటీన్ కార్యక్రమంతా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.