– నాలుగు నెలల్లోనే తొలుత చేయాల్సిన హామీలు అమలు చేశాం
– పదేళ్ల పాలనలో మీ ప్రభుత్వం ఎన్ని అమలు చేసింది?
– సమాధానం చెప్పు కరీంనగర్ అభ్యర్థిని తప్పిస్తా.. లేకుంటే తప్పుకో
– బండి సంజయ్‌కు పొన్నం ప్రకార్ ప్రతిసవాల్
కరీంనగర్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విసిరిన సవాల్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిసవాల్ విసిరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఎన్నికల కోడ్ అమలు కావడానికి ముందు నాలుగు నెలల్లో తొలుత చేయాల్సిన హామీలను అమలు చేశామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. మిగిలినవి కోడ్ ముగిశాక అమలు చేస్తామని వివరించారు. నాలుగు నెలల్లోనే తమ ప్రభుత్వం అమలు చేసిన హామీలను ఓసారి చూడాలని అన్నారు. అదే పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మీ ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసింది? అని ప్రశ్నించారు.
‘ఏ రైతుల ఆదాయం రెట్టింపు చేసింది? యేటా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చింది? ప్రతి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్నారు కదా? ఎంత మందికి వేశారు? తెలంగాణ విభజన హామీలు ఎన్ని అమలు చేసింది? రైతులందరికీ పింఛన్లు ఇస్తామని, ఏ రైతులకు ఇచ్చింది? ఈ దేశంలోని ఆస్తులను అదానీ, అంబానీలకు ఎందుకు అప్పజెప్పింది? ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగేలా ఎందుకు వ్యవహరించింది?’ ఈ ప్రశ్నలకు బండి సంజయ్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే కరీంనగర్ పార్లమెంటు స్థానంలో పోటీ నుంచి బండి సంజయ్ విరమించుకుంటారా? అని ప్రతిసవాల్ విసిరారు.
Also Read: కరెంట్ కట్ కాదు.. పొలిటికల్ పవర్ కట్
కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చేయలేదని, మాట ఇచ్చి తప్పారని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అన్ని హామీలు అమలు చేసినట్టు నిరూపిస్తే తాను పోటీ నుంచి ఉపసంహరించుకుంటానని బండి సంజయ్ సవాల్ విసిరారు. లేదంటే.. 17 లోక్ సభ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నా అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తమకు ఉన్న స్వల్ప సమయంలోనే ఆరు గ్యారంటీలో తొలుత చేయాల్సిన హామీలను వెంటనే అమల్లోకి తెచ్చామని సమాధానం చెప్పారు. మరి.. పదేళ్లు అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసిందో బండి సంజయ్ చెప్పాలని, ఆయన సమాధానం చెబితే కాంగ్రెస్ అభ్యర్థిని తప్పించే బాధ్యత తనదని అన్నారు. సమాధానాలు చెప్పకుంటే బండి సంజయ్ పోటీ నుంచి తప్పుకోవాలని ప్రతి సవాల్ చేశారు.